మాజీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన పోలీసులు.. | Haryana's Dushyant Chautala Allegations On Police | Sakshi
Sakshi News home page

మాజీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన పోలీసులు..

Apr 18 2026 9:10 AM | Updated on Apr 18 2026 9:25 AM

Haryana's Dushyant Chautala Allegations On Police

ఛండీగఢ్‌: హర్యానాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనపై గన్‌ గురిపెట్టారని చౌతాలా సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల మేరకు.. హర్యానాలోని గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనకు సంబంధించి జేజేపీతో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్ధాంత్ జైన్‌ను కలవడానికి మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా వెళ్లారు. ఈ సందర్బంగా ఒక పోలీసు అధికారి తన కారును పోలీసు వాహనంతో అడ్డగించారని, కారును ఢీకొట్టడానికి ప్రయత్నించారని చౌతాలా ఆరోపించారు. సదరు అధికారి అంతటితో ఆగకుండా.. తనపై పిస్టల్ గురిపెట్టినట్టు ఆరోపించారు.

దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, ఈ వీడియోలో ఒక పోలీసు వాహనం తన కారును అడ్డుకోవడం స్పష్టంగా కనిపించింది. మరో వీడియోలో, చౌతాలా తన వాహనం దిగి పోలీసులను నిలదీయడం కనిపిస్తుంది. ఆ తర్వాత, కదులుతున్న ఆ వాహనాన్ని ఆపడానికి ఆయన అందులోకి ఎక్కడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది, కానీ ఆ వాహనం వేగంగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అనంతరం, ఈ వీడియోను చౌతాలా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్బంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ నాయబ్‌ హర్యానా పోలీసులతో దాడి చేస్తున్నాడు. రక్షకుడే వేటగాడిగా మారినప్పుడు, వ్యవస్థను ప్రశ్నించడం అనివార్యమవుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఘటనను పోలీసుల రౌడీయిజంగా అభివర్ణించారు. ఇదే బీజేపీ వారి నయా హర్యానా.. పోలీసు యూనిఫాంలో ఉన్న రౌడీలు అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement