అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది

Grand mother, grand daughter killed in RTC bus collision at chennai - Sakshi

సాక్షి, చెన్నై(అన్నానగర్‌): ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటర్‌పై వెళుతున్న అమ్మమ్మ, మనవరాలు మృతిచెందిన ఘటన తేనిలో జరిగింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వివరాలు.. తేని జిల్లా వరుసనాడు సమీపంలోని మురుకోడై గ్రామానికి చెందిన అమావాసై, భార్య రాణి (44) కేరళ మున్నార్‌ సమీపంలోని బూపరాయ్‌ ప్రాంతంలో ఉంటూ తోట పని చేసేవారు. వీరి కుమారుడు సత్యరాజ్, కుమార్తె యోగాన కుటుంబం కూడా బూపరాయ్‌ ప్రాంతంలోనే ఉంటోంది.

కొద్ది రోజుల క్రితం రాణి, ఆమె కుమారుడు కుమార్తె కుటుంబంతో కలిసి స్వగ్రామమైన తేని జిల్లా మురుకోడై వచ్చారు. మంగళవారం మోటారు సైకిల్, స్కూటర్‌పై బూపరాయ్‌ బయలుదేరారు. మోటారు సైకిల్‌ను రాణి అల్లుడు జయప్రకాష్‌ నడుపుతున్నాడు. అక్కడ అతని భార్య, కూతురు రుద్రశ్రీ (04), బంధువు జగతీశ్వరన్‌ (15) ఉన్నారు. స్కూటర్‌లో రాణి, ఆమె కోడలు వానతి (25), వానతి కుమారుడు ఉద్గేశ్వరన్‌ (07)లు వున్నారు. వానతి స్కూటర్‌ నడిపింది. తేని బోడి రోడ్డులోని తీర్థతొట్టి సమీపంలోని ఓ దుకాణం వద్ద ఆపి టీ తాగారు. తరువాత రుద్రశ్రీ అమ్మమ్మతో కలిసి స్కూటర్‌పై వెళ్లింది.

తొప్పుపట్టి సమీపంలో రోడ్డు మలుపు వద్ద పెరియకుళం నుంచి వచ్చిన ప్రభుత్వ బస్సు వెనుక నుంచి ఢీకొంది. బస్సు చక్రం ఎక్కిదిగడంతో రాణి, రుద్రశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని తల్లిదండ్రులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. 108లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పళని శెట్టిపట్టి పోలీసులు తామరైకులంకు చెందిన బస్సు డ్రైవర్‌ అయ్యన్న స్వామి (52)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top