లఖీంపుర్‌ ఖేరీ: అశిష్‌ బెయిల్‌ పిటిషన్‌.. సుప్రీంలో యోగి సర్కార్‌ తీవ్ర అభ్యంతరాలు

UP Govt Oppose Lakhimpur Kheri Bail Plea SC Reserves Order - Sakshi

ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా తనయుడు అశిష్‌ మిశ్రాకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం. అలహాబాద్‌ హైకోర్టు ఇదివరకే అశిష్‌ బెయిల్‌ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్‌లపై వాదన సందర్భంగా యోగి సర్కార్‌ తీవ్ర అభ్యంతరాలే బెంచ్‌ ముందు ఉంచింది.  

ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్‌ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌(అదనపు) గరిమా ప్రసాద్‌.. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్‌ను కోరింది బెంచ్‌. 

‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్‌.. యూపీ సర్కార్‌కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్‌ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్‌ అడ్వొకేట్‌ దుష్యంత్‌ దవే బెంచ్‌ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు.

ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్‌షీట్‌ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్‌ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన.

ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ అడ్వొకేట్‌ ముకుల్‌ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్‌ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్‌ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్‌ సింగ్‌ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్‌ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. 

అక్టోబర్‌ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్‌ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్‌ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ ఎస్‌యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్‌ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్‌ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు.

ఇంతకు ముందు అశిష్‌కు బెయిల్‌ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్‌ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్‌ పిటిషన్‌పై యూపీ సర్కార్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్‌ను సుప్రీం బెంచ్‌ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్‌.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top