భారత్‌కు కాళీమాత అపార ఆశీస్సులు

Goddess Kali blessing is always with India says PM Narendra Modi - Sakshi

కోల్‌కతా:  భారత్‌కు కాళీమాత అపరిమిత ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ఏక్‌ భారత్, శ్రేష్ట భారత్‌’కు స్వామీజీలు, సాధువులు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తున్నారని కొనియాడారు. రామకృష్ణ మిషన్‌ సైతం ఆ దిశగా పనిచేస్తోందని అన్నారు. రామకృష్ణ మిషన్‌ మాజీ అధినేత స్వామీ ఆత్మస్థానందా  శత జయంతి ఉత్సవాల సందర్భంగా మోదీ ఆదివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

మన నమ్మకం పవ్రిత్రమైనది అయినప్పుడు కాళీమాత మనకు మార్గదర్శనం చేస్తుందని అన్నారు. ప్రపంచ సంక్షేమం అనే స్ఫూర్తితో ఆధ్యాత్మిక శక్తి సహకారంతో భారత్‌ ముందడుగు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్‌ వివాదం, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానమంత్రి కాళీమాతను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్వామీ ఆత్మస్థానందకు మోదీ నివాళులర్పించారు. ఫొటో బయోగ్రఫీ, డాక్యుమెంటరీని విడుదల చేశారు.  

మరోవైపు, రైతులంతా సహజ సాగు పద్ధతుల వైపు మళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఇదొక సామూహిక ఉద్యమంగా మారి, విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రకృతి వ్యవసాయంపై ఆదివారం జరిగిన సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.  ప్రకృతి సేద్యం చేయడం భూమాతకు సేవ చేయడమే అవుతుందన్నారు. ఆర్థిక ప్రగతికి ప్రకృతి సేద్యమే ఆధారమని స్పష్టం చేశారు.  

గోమాతను సేవించుకొనే అవకాశం  
లక్ష్యాన్ని సాధించాలన్న గట్టి పట్టుదల ఉంటే అడ్డంకులు ఏమీ చేయలేవని మోదీ వివరించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే పెద్ద లక్ష్యమైన సాధించడం సులువేనని అన్నారు. ప్రకృతి సేద్యం విషయంలో అంతర్జాతీయంగా అందుబాటులోకి వస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు. మన అన్నదాతల సౌభాగ్యానికి, మన వ్యవసాయ రంగం అభివృద్ధికి, మన దేశ ప్రగతికి ప్రకృతి వ్యవసాయం ఒక చుక్కాని కావాలని ఆకాంక్షించారు. సహజ సాగు పద్ధతులతో నేల తల్లిని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, గోమాతను సేవించుకొనే అవకాశం లభిస్తుందని తెలిపారు. రసాయనాలకు తావులేని వ్యవసాయం ద్వారా ప్రాణాంతక రోగాల బారి నుంచి మనుషులను రక్షించుకోవచ్చని వివరించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ పథకం’ ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30,000 క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top