9 ఏళ్ల క్రితం అదృశ్యం.. చిత్రహింసల నుంచి బాలికకు మోక్షం.. కుటుంబంతో కలిపిన పోలీసులు

Girl Reunion With Family After 9 Years - Sakshi

ముంబై: తొమ్మిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన మైనర్‌ బాలిక ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెను అపహరించిన జోసెఫ్‌ డిసౌజా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అంధేరీలో తల్లిదండ్రులతో కలిసి జీవించే ఏడేళ్ల పూజ 2013 జనవరి 22న స్కూల్‌ నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యింది. సంతానం లేని జోసెఫ్‌ డిసౌజా ఆమెను అపహరించాడు.

పూజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూజ ఫొటోలతో పోస్టర్లు రూపొందించి, నగరంలో అన్ని చోట్లా అతికించారు. అప్పట్లో మీడియాలోనూ ఈ కేసు సంచలనాత్మకంగా మారింది. పూజ ఆచూకీ పోలీసులకు దొరకలేదు. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్‌ డిసౌజా–సోనీ దంపతులకు కుమార్తె జన్మించింది. దీంతో పూజను పని మనిషిగా మార్చేశారు. నిత్యం చిత్రహింసలు పెట్టేవారు. నువ్వు మాకు జన్మించలేదంటూ నిజం చెప్పేశారు.

పూజ తన గోడును స్థానికంగా ఉండే ఓ మహిళ వద్ద వెళ్లబోసుకుంది. సదరు మహిళ పూజకు సంబంధించిన వార్తలు, వివరాల కోసం ఇంటర్నెట్‌లో శోధించింది. తొమ్మిదేళ్ల క్రితం అపహరణకు గురికాగా, కేసు నమోదైనట్లు గుర్తించింది. పోలీసులకు సమాచారం చేరవేసింది. పూజను పోలీసులు ఇటీవలే సొంత తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top