వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా

Fulfilled promises to certain extent says CJI UU Lalit  - Sakshi

వీడ్కోలు సభలో సీజేఐ యు.యు.లలిత్‌ 

న్యూఢిల్లీ:  ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్‌ యు.యు.లలిత్‌ పదవీ కాలం మంగళవారం ముగియనుంది.

ఆరోజు సెలవు దినం కాబట్టి సోమవారమే సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్‌ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు.  

నా ప్రయాణం సంతృప్తికరం  
సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్‌ లలిత్‌ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్‌ లలిత్‌ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top