ఫెర్టిలిటీ తగ్గింది.. ఊబకాయం పెరిగింది

Fertility falls obesity goes up in India says National Family Health Survey - Sakshi

మహిళల్లో 2 శాతానికి తగ్గిన సంతానోత్పత్తి సామర్థ్యం

21 నుంచి 24 శాతానికి పెరిగిన ఊబకాయం

ఐదేళ్లలోపు చిన్నారుల్లో తగ్గిన కుంగుబాటు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర అంశాలు

న్యూఢిల్లీ: భారత మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో విడత నివేదిక (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5) వెల్లడించింది. జనాభా నియంత్రణ పద్ధతులను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సంతానోత్పత్తి సామర్థ్యం 2.2 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తెలిపింది. ఇది బిహార్‌ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్‌ (2.35), జార్ఖండ్‌ (2.26), మణిపూర్‌ (2.17) రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2019–21 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు 707 జిల్లాల్లో 6.37 లక్షల ఇళ్లలో 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులతో మాట్లాడి నివేదిక రూపొందించారు. పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేందుకు వీలుగా పౌరుల సామాజిక, ఆర్థిక, ఇతర నేపథ్యాలను కూడా సర్వేలో పొందుపరిచారు...

సాధికారత సంకేతాలు...
మహిళలు సాధికారత దిశగా దూసుకుపోతున్నారని సర్వే వివరాలు చెప్పకనే చెబుతున్నాయి.
► బ్యాంకు ఖాతాలున్న మహిళల సంఖ్య గత నాలుగేళ్లలో 53 నుంచి 79 శాతానికి పెరిగింది.
► కాలుష్యరహిత, పరిశుభ్రమైన వంట ఇంధనం వాడేవారి సంఖ్య 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగింది.
► పారిశుద్ధ్య సౌకర్యాలు 49 నుంచి 70 శాతానికి పెరిగాయి.
► కరోనా కాలంలో చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటుగా మారింది.
► నీళ్లు, సబ్బు సదుపాయాలున్న వారి సంఖ్య 60 నుంచి 78 శాతానికి పెరిగింది!
► 15–49 మధ్య వయసు వివాహితల్లో ఉద్యోగుల సంఖ్య 31 శాతం నుంచి 32కు పెరిగింది.

పెరిగిన ఊబకాయం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4తో పోలిస్తే ఊబకాయం సమస్య దేశాన్ని బాగా వేధిస్తోంది. ఊబకాయుల సంఖ్య మహిళల్లో 21 శాతం నుంచి 24 శాతానికి, మగవారిలో 19 నుంచి 23 శాతానికి పెరిగింది. కేరళ, అండమాన్‌ నికోబర్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్, గోవా, సిక్కిం, మణిపూర్, ఢిల్లీ, తమిళనాడు, చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరిల్లో మూడో వంతుకు పైగా మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు.

పిల్లల్లో తగ్గిన కుంగుబాటు  
చిన్నారుల్లో కుంగుబాటు గత నాలుగేళ్లలో తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల్లో కుంగుబాటు 38 నుంచి 36 శాతానికి తగ్గినట్టు తేలింది. పట్టణాల (30 శాతం) కంటే గ్రామీణ బాలల్లో (37 శాతం) కుంగుబాటు ఎక్కువగా ఉంది.

మహిళల్లో నాలుగో వంతు యుక్తవయసుకు ముందే పెళ్లాడారు
దేశవ్యాప్తంగా 18–29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 25 శాతం మంది, 21–29 ఏళ్ల పురుషుల్లో 15 శాతం మంది యుక్త వయసుకు ముందే పెళ్లి చేసుకున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. భారత్‌లో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు పెళ్లికి యుక్తవయసన్నది తెలిసిందే. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 42 శాతం మంది మహిళలకు యుక్తవయసుకు ముందే పెళ్లయింది. బిహార్‌ (40 శాతం), త్రిపుర (39), జార్ఖండ్‌ (35), ఏపీ (33), తెలంగాణ (27) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

యుక్తవయసుకు ముందే తాళి కడుతున్న వాళ్ల అబ్బాయిల సంఖ్య బిహార్‌లో అత్యధికంగా 25 శాతంగా తేలింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్‌ (24 శాతం), జార్ఖండ్‌ (22), అరుణాచల్‌ప్రదేశ్‌ (21) ఉన్నాయి. మొత్తమ్మీద బాల్య వివాహాలు తగ్గుముఖం పడుతున్నాయని సర్వే పేర్కొంది. 12 ఏళ్లపాటు, అంతకుమించి చదువుకునే అమ్మాయిలు మిగతా వారికంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని తెలిపింది. టీనేజీ తల్లుల సంఖ్య ముస్లింల్లో ఎక్కవగా (8 శాతం) ఉంది.  

గర్భ నిరోధక పద్ధతుల వాడకం పెరిగింది
► గర్భనిరోధక పద్ధతుల వాడకం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది.
► కుటుంబ నియంత్రణ పాటించని వారి సంఖ్య 13 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది.
► ఆస్పత్రి ప్రసవాల సంఖ్య కూడా 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది.
► గ్రామీణ ప్రాంతాల్లో కూడా 87 శాతం గర్భిణులు ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 94 శాతం.
► గర్భనిరోధం మహిళల బాధ్యతేనని 35.1 శాతం మంది పురుషులు భావిస్తున్నారు. వీరి సంఖ్య చండీగఢ్‌లో అత్యధికంగా (69) ఉంది.
► మహిళల్లో గర్భ నిరోధక పద్ధతుల వాడకం వివాహేతర సంబంధాలకు దారి తీయొచ్చని 19.6 శాతం మగవాళ్లు అనుమానిస్తున్నారు! ఇలా భావిస్తున్న వారి సంఖ్య కేరళలో అత్యధికంగా (44.1) ఉంది!!
► అబార్షన్‌ చేయించుకుంటున్న వారిలో దాదాపు సగం మంది అవాంఛిత గర్భాన్నే కారణంగా చెప్తున్నారు.
► వీరిలో 16 శాతం అబార్షన్‌ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

కుటుంబ నియంత్రణ పాటించాలన్న ఆసక్తి ఉన్నా అవగాహన లేక, వాటి వాడకం తెలియక దంపతులు ఎక్కువ మందిని కనేవారు. ఆ పరిస్థితుల్లో మార్పు రావడం మంచి పరిణామం
– కేంద్రం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top