
బెంగళూరు: మద్యం మత్తులో విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీలోని కాన్పూర్‌కు చెందిన ప్రతీక్(30) ఇండిగోకు చెందిన 6ఈ308 ఢిల్లీ–బెంగళూరు విమానం 18ఎఫ్ సీట్లో కూర్చున్నాడు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి మత్తులో ఉన్న ప్రతీక్ తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు.
అంతటితో ఆగక అత్యవసర ద్వారం తెరిచేందుకు రాగా సిబ్బంది అతడిని వారించారు. వినిపించుకోకపోవడంతో అతడ్ని బలవంతంగా కూర్చోబెట్టారు. విమానం బెంగళూరుకు చేరుకున్నాక పైలట్ అతడిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి అప్పగించారని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీక్‌పై ఐపీసీ సెక్షన్లు 290, 336లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని 11(ఏ) కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.