వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి? | Sakshi
Sakshi News home page

వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?

Published Wed, May 1 2024 9:26 AM

Dogs Become Aggressive in Summer

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా  ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. వేసవిలో శునకాలు రెచ్చిపోతుండటాన్ని మనం చూస్తుంటాం. అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మనుషులకు మాదిరిగానే చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం మొదలైనవి కుక్కల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం కుక్కలు చల్లని వాతావరణంలో ఉదాశీనంగా ఉంటాయి. అయితే వేసవికాలం రాగానే  అవి హైపర్ యాక్టివ్‌గా మారిపోతాయి. వేసవిలో కుక్కలు మరింత దూకుడుగా మారుతాయని ఒక పరిశోధనలో వెల్లడయ్యింది.

అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోస్ ఆర్చ్ తెలిపిన వివరాల ప్రకారం వేసవి కాలంలో శునకాలు మరింత వేడి అనుభూతికి లోనవుతాయి. వేసవికాలం మనుషులకు మించి శునకాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అధిక వేడి లేదా ఉష్ణోగ్రత శునకాలలోని థర్మోగ్రూలేషన్‌ను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కుక్కలు వేడిని తట్టుకోలేవు. ఇటువంటి పరిస్థితిలో కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి.

వేసవి కాలంలో కుక్కలలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుతుందని పెన్ స్టేట్ యూనివర్శిటీ ఒక పరిశోధనలో కనుగొంది. దీని కారణంగా అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని గుర్తించారు. ఈ సమయంలో కుక్కలు ఆకస్మికంగా మొరగడం, మనుషులను చుట్టుముట్టడం, కరవడం, పరిగెత్తడం లాంటి చర్యలను చేస్తాయి.

వేసవిలో పెంపుడు శునకాలు లేదా వీధి కుక్కలు ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవి ఎప్పుడూ నీరసంగా పడుకున్నట్లు కనిపిస్తే, అవి వడ దెబ్బకు గురయ్యాయని గుర్తించాలి. అటువంటి స్థితిలో వాటికి వైద్య సహాయం అందించాలి.

Advertisement
 
Advertisement