
భుజ్: నిత్యం దూకుడుగా వ్యవహరిస్తున్న పాకస్తాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోమారు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్‌లోని సరిహద్దు ప్రాంతమైన సర్ క్రీక్‌లో చొరబాటులాంటి ప్రయత్నాలు చేస్తే, తాము చూస్తూ ఊరుకునేది లేదని రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు.
‘పాక్‌తో యుద్ధం భారత్ లక్క్ష్యం కాదు’
గుజరాత్‌లోని భుజ్ సమీపంలోగల సైనిక స్థావరంలో జరిగిన దసరా వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయుధ పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌లోని అన్ని లక్ష్యాలను భారత సైన్యం విజయవంతంగా సాధించిందని, పాకిస్తాన్‌తో యుద్ధం చేయడం భారత్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అయితే సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా.. ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
సరిహద్దు ఉగ్రవాదంపై నిరంతర పోరాటం
పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్లే ఒక మార్గం క్రీక్ ప్రాంతం గుండా వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నించినా, పాకిస్తాన్ ఉద్దేశాలు ఈ విషయంలో లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయని రాజనాథ్ పేర్కొన్నారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, భారత సరిహద్దులను కాపాడుతున్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
సర్ క్రీక్ వివాదం ఏమిటి?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ లేహ్ నుండి సర్ క్రీక్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించేందుకు విఫల ప్రయత్నం చేసిందని, అయితే ప్రతీకార చర్యలో భాగంగా భారత దళాలు పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయన్నారు. భారతదేశ రక్షణ వ్యవస్థకు సైన్యం, వైమానిక దళం, నావికాదళం మూడు స్తంభాలని రక్షణ మంత్రి అభివర్ణించారు. కాగా సర్ క్రీక్ అనేది గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్- పాకిస్తాన్ మధ్య 96 కి.మీ పొడవైన టైడల్ నదీముఖద్వారం. సముద్ర సరిహద్దు రేఖలపై ఇరు దేశాలు వేర్వేరు వివరణలు ఇవ్వడం కారణంగా దీనిని వివాదాస్పద ప్రాంతంగా పరిగణిస్తున్నారు.