చీతా.. చిరుత.. జాగ్వార్‌.. ఒకటే మోడల్‌ దేనికదే స్పెషల్‌! 

Difference Between Cheetahs Leopards Jaguars And Pumas Are Subspecies - Sakshi

ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో వదిలినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చీతాలను చూస్తున్న జనం దాదాపు అలాగే కనిపించే చిరుత పులులుగా భ్రమపడటం, మన దగ్గర ఉన్నాయిగా అనుకోవడం కూడా కనిపిస్తోంది.

నిజానికి పిల్లి నుంచి పెద్దపులి దాకా అన్నీ ఒకే ప్రధాన జాతికి చెందిన జీవులు. ఇందులోనే చీతాలు, చిరుత పులులు, జాగ్వార్‌లు, పుమాలు వంటివి ఉప జాతులుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన చారలు, గుర్తులు, ముఖ కవళికలు, పాదముద్రలతో ఉంటాయి. వాటి ఆకారం, పరిమాణం కూడా వేర్వేరుగా ఉంటాయి. జాగ్వార్‌లు పెద్దగా బరువు ఎక్కువగా ఉంటాయి. చీతాలు సన్నగా ఉండి, అత్యంత వేగంగా కదులుతాయి. చిరుతలు అయితే చెట్లు కూడా సులభంగా ఎక్కగలవు. 

జూలలో ఉన్నవి పరిగణనలోకి తీసుకోరు. 
భారత్‌లో 70ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. అయితే మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కు సహా మరికొన్ని జూలలో చీతాలు ఉన్నాయి. ఇలా జూలలో ఉన్న జంతువులను అధికారిక లెక్కల్లో పరిగణనలోకి తీసుకోరు. అడవులు, సహజ సిద్ధ ఆవాసాల్లో ఉండే వాటినే లెక్కల్లోకి తీసుకుంటారు. 1952 తర్వాత మన దేశంలోని అడవుల్లో ఎక్కడా చీతాలు కనిపించకపోవడంతో అంతరించిపోయినట్టు ప్రకటించారు. 

చీతాలు.. చిన్నవైనా వేగంగా.. 
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు చీతాలు. కేవలం మూడు సెకన్లలోనే గంటకు 60 మైళ్ల (సుమారు 100 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగలవు. 
ఇవి 70 కేజీల వరకు బరువు.. 112 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. 
శరీరం, కాళ్లు పొడవుగా ఉంటాయి. లేత గోధుమ రంగు శరీరంపై.. నలుపు రంగులో గుండ్రంగా, చిన్నవిగా మచ్చలు ఉంటాయి. 
రాత్రిపూట కళ్లుగా సరిగా కనబడవు. అందుకే ఉదయం, సాయంత్రం సమయాల్లోనే వేటాడుతాయి. 
3, 4 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతాయి.  
చాలా వరకు ఒంటరిగా వేటాడుతాయి. అరుదుగా రెండుమూడు కలిసి వేటాడుతాయి. 
ఒకప్పుడు మన దేశంలో విస్తృతంగా ఉండేవి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనూ ఉన్నాయి. ఎక్కువగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఉష్ణ మండల అరణ్యాలు, గడ్డి భూములను ఆవాసాలుగా చేసుకుంటాయి. మనుషులకు మరీ ప్రమాదకరమేమీ కావు. పెద్ద జంతువుల జోలికి కూడా వెళ్లవు. 

చిరుతలు.. మధ్యస్థం, ప్రమాదకరం.. 
ఈ జాతి జీవుల్లో మధ్యస్థమైన పరిమాణంలో ఉంటాయి. పొడవు మాత్రం ఎక్కువ. 
నాజూకుగా కనిపించే శరీరం, పొట్టి కాళ్లు, మందమైన తోక ఉంటాయి. వీటి కంటిచూపు అత్యంత చురుకైనది. చెట్లు కూడా ఎక్కగలవు. 
ఏడాది పొడవునా, ప్రధానంగా వానాకాలంలో పిల్లలను కంటాయి. అందుకే వీటి సంఖ్య గణనీయంగా ఉంటుంది. 
ఇవి భారత ఉప ఖండం, ఆగ్నేయాసియా, సబ్‌ సహరన్‌ ఆఫ్రికా, పశ్చిమ, సెంట్రల్‌ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువ. 
తమ ఆవాసాలు, ప్రాంతాలను బట్టి వీటి రంగులో కొంత తేడా ఉంటుంది. గడ్డి మైదానాల్లోని చిరుతలు లేత పసుపు రంగులో.. దట్టమైన అడవుల్లో ఉండేవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. మచ్చలు ఎక్కువగా, పెద్దవిగా ఉంటాయి. 
ఇవి క్రూరంగా వ్యవహరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. మన దేశంలోని చాలాచోట్ల చిరుతలు మనుషులపై దాడిచేసిన ఘటనలు ఉన్నాయి. 

జాగ్వార్‌లు.. భారీ పరిమాణంలో.. 
ఇవి బరువైన, పెద్ద శరీరాన్ని.. పదునైన గోళ్లు, పళ్లు, పంజా కలిగి ఉంటాయి. ఈ జాతిలో సింహం, పెద్దపులి తర్వాత జాగ్వార్‌ను మూడో పెద్ద జంతువుగా పరిగణిస్తారు. 65 కేజీల నుంచి 140 కేజీల దాకా బరువుంటాయి. 
చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువులపైనా దాడి చేస్తుంది. 
ముదురు ఎరుపు, గోధుమ వర్ణంతోపాటు పసుపు (టానీ ఎల్లో కలర్‌) రంగులోనూ ఉంటాయి. వీటిపై మచ్చలు పెద్దగా భిన్నంగా ఉంటాయి. ఇవి రాత్రీపగలు వేటాడగలవు. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. జాగ్వార్లు నీళ్లలో సులభంగా ఈదగలవు. మన దేశంలో జాగ్వార్లు లేవు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top