
జస్టిస్ వర్మ అభిశంసన అంశమే కారణమా?
అభిశంసనపై విపక్షాల నోటీసును సమ్మతించిన జగదీప్ ధన్‌ఖడ్
ఆ నోటీసుకు ఓకే చెప్పడాన్ని జీర్ణించుకోని ప్రభుత్వం!
ఆ కారణంగానే బీఏసీ భేటీకి నడ్డా, రిజిజు డుమ్మా
వీళ్ల గైర్హాజరీతో ఆగ్రహంతో రాజీనామా చేసిన ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: గుండె సంబంధ యాంజియోప్లాస్టీ, అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన నిజంగానే అంత అనారోగ్యంగా ఉన్నారా? లేదంటే మోదీ సర్కార్‌పై మరింత అసహనంతో రగిలిపోయారా?. ఆయనకు కోపం తెప్పించిన విషయమేంటి?. అందుకు స్పందనగా మోదీ సర్కార్ ఏం చేసింది? ఇలాంటి వరుస ప్రశ్నల పరంపర సోమవారం మొదలై గంటలు గడుస్తున్నకొద్దీ సందేహాలు, విశ్లేషణలు మరింత ఎక్కువయ్యాయి.
కాలిన కరెన్సీ కట్టల ఉదంతంలో అభిశంసనను ఎదుర్కోబోతున్న అలహాబాద్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పరోక్షంగా ధన్‌ఖడ్ పదవికి ఎసరుపెట్టారని మెజారిటీ విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. సాధారణంగానే న్యాయవ్యవస్థపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించే ధన్‌ఖడ్ అరుదుగా వచ్చే జడ్జీల అభిశంసన అవకాశాన్ని తన హయాంలో విజయవంతంగా పూర్తిచేయాలన్న అత్యుత్సాహం చివరకు కేంద్రప్రభుత్వానికి కోపం తెప్పించిందని తెలుస్తోంది.
మీ ఏకపక్ష నిర్ణయంపై తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని తెలియజేప్పేందుకే పార్లమెంట్ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) భేటీకి రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజులు రాలేదని తెలుస్తోంది. దీనిపై ధన్‌ఖడ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారని విశ్లేషణలు వెలువడ్డాయి. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి మద్దతు పలికే తనను ఇలా కేంద్రప్రభుత్వం ఒకే ఒక్క అంశాన్ని సాకుగా చూపి అవమానించిందనే తీవ్ర అసహనంతో వెంటనే ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.
మధ్యాహ్నం 1 గంట నుంచి 4.30 మధ్యలోనే..
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4.30 గంటల మధ్యలోనే ప్రభుత్వానికి, ఉపరాష్ట్రపతికి మధ్య సఖ్యత ఒక్కసారిగా, పూర్తిగా చెడిందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘కీలక అంశాలపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ధన్‌ఖడ్ సారథ్యంలో బీఏసీ భేటీ జరిగింది. ఈ భేటీకి నడ్డా, రిజిజు హాజరయ్యారు. మళ్లీ 4.30 గంటలకు సమావేశమవుదామని ధన్‌ఖడ్ చెప్పారు. ఆ సమయంలో భేటీకి నడ్డా, రిజిజు రాలేదు. కనీసం రావట్లేదని ధన్‌ఖడ్ సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయనకు పరువు పోయినంత పనైంది. దాంతో చేసేదిలేక భేటీని మంగళవారం మధ్యాహా్ననికి వాయిదావేసి ఆయన నిరుత్సాహంగా వెళ్లిపోయారు’’అని జైరాం వెల్లడించారు.
ఖర్గేకు అవకాశం ఇవ్వడమూ మరో కారణమా?
సోమవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాల గంట ముగిశాక రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ధన్‌ఖడ్ అనుమతించారు. దీంతో ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై కేంద్రప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఖర్గే ప్రసంగించారు. ఆపరేషన్‌సిందూర్‌పై వారం తర్వాత చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఖర్గేకు ముందే ఆ అంశంపై అవకాశమిచ్చి తమపై విమర్శలు గుప్పించే అవకాశం అనవసరంగా ఇచ్చారని ధన్‌ఖడ్‌పై మోదీ సర్కార్ గుర్రుగా ఉందని కొందరు బీజేపీ పార్లమెంట్ సభ్యులే చెప్పడం గమనార్హం.
పుండుమీద కారం చల్లినట్లుగా ఖర్గే ప్రసంగించిన వెంటనే జడ్జి వర్మపై అభిశంసనకు సంబంధించి రాజ్యసభలో కేవలం విపక్ష సభ్యుల నోటీస్‌ను ధన్‌ఖడ్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నోటీస్‌పై అధికారకూటమి ఎంపీల సంతకాలు లేవు. అయినాసరే దానికి ధన్‌ఖడ్ ఆమోదముద్రవేయడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇదే అంశంపై లోక్‌సభలో జడ్జిపై అభిశంసన తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సమయంలోనే ఆ నోటీస్‌కు రాజ్యసభ చైర్మన్ హోదాలో ధన్‌ఖడ్ ఆమోదం తెలపడాన్ని మోదీ సర్కార్ తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. విపక్షాల నోటీస్ ఆమోదంతో ఇకపై జరిగే అభిశంసన ప్రక్రియ మొత్తం విజయమంతా విపక్షాల ఖాతాలో పడిపోతుందన్న అక్కసు అధికారపక్షంలో పెరిగింది. దీని తర్వాతనే ఖర్గే, రిజిజులు బీఏసీ భేటీకి డుమ్మా కొట్టడం, ధన్‌ఖడ్ అసహనం వ్యక్తంచేయడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది.

అవమానించిన నడ్డా!
రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా నడ్డా ఉద్దేశపూర్వకంగా కల్పించుకున్నారు. అధ్యక్షస్థానంలో కూర్చున్న ధన్‌ఖడ్‌కు వేలు చూపిస్తూ.. ‘‘ఇక్కడ ఖర్గే మాట్లాడింది ఏదీ రికార్డింగ్‌లోకి వెళ్లదు. నేను ఏం మాట్లాడితే అది మాత్రమే రికార్డుల్లోకి వెళ్తుంది’’అని అన్నారు. ‘‘ఖర్గే ప్రసంగంవేళ నిష్పాక్షికంగా ధన్‌ఖడ్ సభ నడుపుతుంటే నడ్డా కల్పించుకున్నారు. అలా అవమానించడం ఆయన తట్టుకోలేకపోయారు.
ఇది ఆకస్మిక నిర్ణయమే
రాజీనామా లేఖలో పేర్కొన్న ‘అనారోగ్యం’కారణం కానేకాదని ఉపరాష్ట్రపతి సచివాలయం సైతం పరోక్షంగా ధ్రువీకరిస్తోంది. ఉపరాష్ట్రపతి జూలై 23వ తేదీన జైపూర్‌లో ఒకరోజు పర్యటన తాజాగా ఖరారైంది’’అని సోమవారం మధ్యాహ్నం 3.53 గంటలకు ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరికొన్ని గంటల్లో సొంత రా ష్ట్రపర్యటనకు సంసిద్ధమైన వ్యక్తి మదిలో రాజీనామా ఆలోచన ఉండదని, సోమ వా రం జరిగిన అనూహ్య పరిణామాలే ఆ యనను రాజీనామాకు ఉసిగొల్పాయని తెలుస్తోంది.
ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా: మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి సోమవారం రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ జగదీప్ ధన్‌ఖడ్‌జీకి భారత ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.