
పశ్చిమ సరిహద్దు వెంబడి ఉన్న అన్ని
డిఫెన్స్ ఎయిర్‌పోర్టుల్లో అమలుచేయండి
ప్రైవేట్ విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ
న్యూఢిల్లీ: కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో రక్షణశాఖ పరిధిలోని విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే ప్రైవేట్ విమానాల, చార్టర్, ప్రైవేట్ జెట్ నిర్వహణ సంస్థలు కచ్చితంగా తమ విమానాల కిటికీలను మూసే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది.
డిఫెన్స్ స్థావరాలు, విమానాశ్రయాల పూర్తి వివరాలు బహిర్గతం కావొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కిటికీల నుంచి ఫొటోలు, వీడియోలు తీయకుండా నివారించే ఉద్దేశ్యంతో కిటికీలను మూసే ఉంచాలని, కిటికీల షేడ్స్ తొలగించకూడదని ప్రైవేట్ విమానయాన సంస్థలకు డీజీసీఏ పంపిన ఉత్తర్వులో స్పష్టంచేసింది. మొత్తంగా 32 ఎయిర్‌పోర్ట్‌లలో ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.
లేహ్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, ఆదంపూర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జో«ద్‌పుర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలీ, మహారాజ్‌పూర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్(గోవా), విశాఖపట్నంలోని విమానాశ్రయాలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంది. ఆర్మీ, నేవీ విమానాల రాకపోకలతోపాటు సాధారణ ప్రయాణికుల విమానాల రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్ట్‌లలో ముఖ్యంగా ఈ నిబంధనను అమలుచేయనున్నారు.
అక్కడి నుంచి రాకపోకలు సాగించే ప్రైవేట్ విమానాలు, చార్టర్, ప్రైవేట్ జెట్‌లలో ప్రయాణించే వాళ్లు కిటికీల గుండా కెమెరా, స్మార్ట్‌ఫోన్‌లతో ఎయిర్‌బేస్‌ల ఫొటోలు, వీడియోలు తీసే ఆస్కారముందని గ్రహించి ప్రభుత్వం కొత్తగా పలు పశ్చిమ తీర ఎయిర్‌పోర్టుల్లో ఈ నిబంధనను అమల్లోకి తెస్తోంది. విమానం టేకాఫ్ అయ్యాక 10,000 అడుగుల ఎత్తుకు వెళ్లేదాకా విండో షేడ్స్ తొలగించకూడదు. 10,000 అడుగుల కంటే ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విమానం ల్యాండింగ్‌కు సిద్ధమైతే ఆ ఎత్తులో విండో షేడ్స్ తెరుచుకోవచ్చు.
కానీ ల్యాండింగ్ కోసం 10,000 అడుగుల దిగువకు దిగిరాగానే మళ్లీ విండో షేడ్స్‌ను మూసేయాల్సిందే. ఎమర్జెన్సీ కిటీకీలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. విండోషేడ్స్ తెరిచి ఫొటోలు, వీడియోలు తీసే ప్రయాణికులు తగు పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది. సాధారణంగా ఏదైనా ప్రయాణికుల విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో అగ్నిప్రమాదం లాంటివి ఏమైనా జరిగితే అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు వీలుగా విండోషీట్స్‌ను తెరచే ఉంచుతారు.