పొగరాదు..  సెగరాదు..! | Delhi Metro to launch hydrogen-powered buses in Central Vista | Sakshi
Sakshi News home page

పొగరాదు..  సెగరాదు..!

May 16 2026 12:36 AM | Updated on May 16 2026 12:36 AM

Delhi Metro to launch hydrogen-powered buses in Central Vista

ఢిల్లీ సెంట్రల్‌ విస్టాలో హెడ్రోజన్‌ బస్సులు 

దేశంలోనే తొలిసారిగా ప్రారంభం 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణహిత హైడ్రోజన్‌ బస్సులు రంగప్రవేశం చేశాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కేంద్ర సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ వద్ద హైడ్రోజన్‌ ఆధారిత షటిల్‌ బస్సు సర్వీసులను ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) లాంఛనంగా ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, పెట్రోలియం, సహజ వాయువు శాఖల సమన్వయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కింది. పెట్రోల్, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టారు.  

పర్యావరణ హితం.. అత్యాధునిక భద్రత.. 
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) అందించిన రెండు హైడ్రోజన్‌ బస్సులను డీఎంఆర్‌సీ నడుపుతోంది. ఒక్కో బస్సులో 35 మంది ప్రయాణించే వీలుంది. ఈ బస్సులు కేవలం రవాణా సౌకర్యాన్ని మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి భద్రతను కూడా కల్పిస్తున్నాయి. ప్రతి బస్సులో జీపీఎస్‌ ఆధారిత ట్రాకింగ్‌ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతతో పాటు బస్సు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుంది. కాలుష్య రహిత ఇంధనంతో నడిచే ఈ బస్సులు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయబోయే హైడ్రోజన్‌ రవాణా వ్యవస్థకు రోల్‌ మోడల్‌ కానున్నాయి. 

ప్రయాణ మార్గాలు ఇవే.... 
సెంట్రల్‌ సెక్రటేరియట్‌ (కేంద్ర సచివాలయం), సేవా తీర్థ మెట్రో స్టేషన్ల మధ్య ఈ బస్సులు నడుస్తాయి. సెంట్రల్‌ విస్టా పరిధిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలైన నిర్మాణ్‌ భవన్, విజ్ఞాన్‌ భవన్, అక్బర్‌ రోడ్, బరోడా హౌస్‌ వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తాయి. వీటితో పాటు ఇండియా గేట్, నేషనల్‌ స్టేడియం, నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్స్‌ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికీ ఈ సేవలు ఉపయోగపడతాయి.  

వేళలు, టికెట్‌ ధరలు... 
ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు 30 నిమిషాలకోబస్సు అందుబాటులో ఉంటుంది. సామాన్యులకు భారం కాకుండా స్టేజీల వారీగా కేవలం రూ. 10, రూ. 15 చొప్పున టిక్కెట్‌ ధరలను నిర్ణయించారు. ప్రయాణికులు నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్, యూపీఐ లేదా నగదు రూపంలో టిక్కెట్‌ తీసుకునే వెసులుబాటును కల్పించారు. మెట్రో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి (లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ) ఇబ్బంది పడకుండా ఈ బస్సులు సహాయపడతాయని, రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఇదొక కీలక ముందడుగు అని డీఎంఆర్‌సీ డైరెక్టర్‌ అమిత్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement