ఎస్జీఎన్పీ సందర్శకులకు ఎకోఫ్రెండ్లీ బస్సులు
సాక్షి, ముంబై: సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (ఎస్జీఎన్పీ)ను సందర్శించే పర్యాటకుల కోసం ఎకోఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ బస్సులను నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఈ బస్సుల కోసం ఈ పార్క్‌లోని ఉద్యానవనంలోని కొంత భాగాన్ని పార్కింగ్ లాట్‌గా తీర్చిదిద్దనున్నారు. ఎస్జీఎన్పీ పార్కులో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఎంటీడీసీతో మాట్లాడుతున్నామని, అయితే పార్కింగ్ స్థలం కొరత వల్ల ఈ ప్రణాళికకు జాప్యం జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. స్థలం ఖాళీ లేనట్లయితే గార్డెన్లో కొంత భాగాన్ని పార్కింగ్ లాట్‌గా తీర్చి దిద్దుతామని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సేవలు జూలై నుంచి అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
ఈ బస్సుల నిర్వహణ, చార్జీల సేకరణ మొత్తం ఎంటీడీసీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సులు ఎస్జీఎన్పీ మేయిన్ గేట్ నుంచి కన్హేరి కేవ్స్ వరకు నడుస్తాయి. ఇందుకు గాను చార్జీలను ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉండగా ఈ నేషనల్ పార్క్‌కు ఎడమ భాగంలో క్రిష్ణగిరి ఉద్యాన్ ఉంది. ఈ గార్డెన్‌ను అభివృద్ధి చేసి ఏడాది అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళ్లలో వాకింగ్ చేసేవారికి ఈ గార్డెన్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ఉద్యానవన అభివృద్ధికి గాను ఇప్పటికే రూ.10 లక్షల వ్యయం అయినట్లు అధికారి వెల్లడించారు. వివిధ రకాల పక్షులు, పూల మొక్కలు, చెట్లు అనేకం ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులను బయట పార్క్ చేయడం ద్వారా ట్రాఫిక్‌జామ్ సమస్యలు తలెత్తి పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అధికారి వెల్లడించారు.