కాలుష్యంపై ఏం చేస్తారో చెప్పండి?: సుప్రీం

Delhi air quality worsens, remains in very poor zone - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)–ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియాపరత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని అరికట్టడానికి ఏం చేస్తారో చెప్పాలని పేర్కొంది. 24 గంటల్లోగా పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమైతే తామే అసాధారణ చర్యలకు పూనుకుంటామని తేల్చిచెప్పింది.

ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యతను పెంచాలని, పరిసర రాష్ట్రాల రైతులకు పంట వ్యర్థాలను నిర్మూలించే యంత్రాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పర్యావరణవేత్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కాలుష్యం స్థాయిలు పడిపోయేలా కఠిన చర్యలు చేపడతారని తాము ఆశిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమం ‘రెడ్‌ లైట్‌ ఆన్, గాడీ ఆఫ్‌’పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.  కాలు ష్యంపై ప్రచారం పేరిట బ్యానర్లు చేతికి ఇచ్చి చిన్నపిల్లలను రోడ్లపై నిలబెడుతున్నారని, వారి ఆరో గ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది.

ఢిల్లీలో నేటినుంచి స్కూళ్లు మూసివేత
దేశ రాజధానిలో అన్ని పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతాయని వెల్లడించింది. ఢిల్లీ పాఠశాలల్లో భౌతికంగా తరగతులు నిర్వహిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ప్రతిస్పందించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top