ఢిల్లీకి కాలుష్యం కాటు

Delhi air quality to turn severe by night as people defy fireworks ban - Sakshi

నిషేధం ఉన్నా దీపావళి సంబరాలు

కరోనా కేసుల పెరగడంపై ఆందోళన

అమిత్‌ షా అత్యవసర సమీక్ష

న్యూఢిల్లీ: బాణసంచాపై నిషేధం ఉన్నా ప్రజలు పట్టించుకోలేదు. కాలుష్యం తీవ్రతకు కరోనా మళ్లీ విజృంభిస్తుందని చెప్పినా వినిపించుకోలేదు.  దీపావళి పర్వదినాన అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా టపాసుల మోత మోగుతూనే ఉంది. ఫలితంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలిలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 కొన్ని ప్రాంతాల్లో 500 దాటి పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

2 రోజుల్లో 32% పెరిగిన కాలుష్యం
కాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం పీఎం 2.5 స్థాయి శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో 32 శాతం పెరిగింది.  ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యతా సూచిలో పీఎం 2.5 స్థాయి 490 వరకు వెళ్లింది. 490 అంటే ఆ గాలిలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్టు లెక్క. ఆ సమయంలో పీల్చిన గాలితో ఆస్తమా వంటి వ్యాధులు తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ కాలుష్యంతో కరోనా వైరస్‌ కూడా విజృంభిస్తోంది.

ఢిల్లీలో కాలుష్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎస్‌ఏఎఫ్‌ఏఆర్‌) అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం ఉదయం 9 గంటల వేళ పీఎం 2.5 ఏకంగా 545కి చేరుకుంది.  ఇలా ఉండగా, ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్, ముఖ్యమ్రంతి అరవింద్‌ కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ హాజరయ్యారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top