దసరా సీజన్‌: ఇదో రకం దోపిడి, కానీ తప్పట్లేదు!

Dasara Season: Private Travels Bike Travelling Fare Shock To Passengers Bangalore - Sakshi

బెంగళూరు: దసరా పండుగ కావడంతో బెంగళూరు నుంచి వేలాది మంది సొంతూళ్లకు పయనమయ్యారు. వరుస సెలవులు రాగా ఐటీ బీటీ, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు విరామం కోసం బయటి ప్రాంతాలకు వెళ్లడానికి ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. ఇదే చాన్సని ప్రైవేటు బస్సులు ప్రయాణికుల నుంచి దోపిడీకీ పాల్పడుతున్నాయి.

బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు టికెట్‌ రేట్లు విపరీతంగా పెంచేశారు. గౌరీ–గణేశ్‌ పండుగ సమయంలో అధిక చార్జీలను వసూలు చేయరాదని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో రవాణా శాఖ హెచ్చరించింది. అధికారులు దాడులు చేసి అధిక టికెట్‌ వసూలు చేస్తున్న వారికి జరిమానా విధించారు. కానీ ఏమాత్రం మార్పులేని బస్సుల యజమానులు దసరాకు కూడా అదే దందాను అమలు చేశాయి. టికెట్లు అందుబాటు ధరల్లోనే ఉంటాయనుకున్న ప్రయాణికుల ఆశలు నీరుకారాయి.

పండుగ, సెలవులతో ఊళ్లకు  
అక్టోబరు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉండటంతో శుక్రవారం సాయంత్రం నుంచి టెక్కీలు తదితరులు పెద్దసంఖ్యలో బెంగళూరు నుంచి ఊళ్లకు పయనమయ్యారు. ప్రైవేటు బస్సుల వెబ్‌సైట్, బస్‌బుకింగ్‌ యాప్‌ సమాచారం ప్రకారం మంగళవారం రాత్రి వరకు బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించే ప్రైవేటు బస్సులు చార్జీలు మామూలు కంటే మూడు రెట్లు పెరిగాయి.  

తాజా టికెట్‌ ధరలు ఎంతంటే  
►    బెంగళూరు నుంచి ఉడుపికి సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్, క్లబ్‌క్లాస్‌ టికెట్‌ ధర రూ.700 –750 ఉంటుంది. కానీ గత నెల 30 తేదీ నుంచి అక్టోబరు 04 తేదీ వరకు రూ.1,400 నుంచి రూ.1,800 కు ఎగబాకింది.  
►    బెళగావికి రూ.800– 900 ఉంటే ఇప్పుడు రూ.1,100– 1,500 కి రేటు పెరిగింది.  
►  హుబ్లీకి రూ.750–800 ఉండగా ప్రస్తుతం రూ.1,200 నుంచి 1,500 టికెట్‌ ధర పెరిగింది.  
►   కలబుర్గికి రూ.800–900 ఉండగా రూ.1,200 –1,500 ధర పెంచేశారు.  
►   ప్రైవేటు బస్సుల టికెట్లు బుకింగ్‌ అయిపోయిందని సమాచారం. డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి అదనపు బస్సులను ఆరంభించారు.  

మెజెస్టిక్‌ బస్టాండు రద్దీ  
బెంగళూరులోని ప్రధాన మెజెస్టిక్‌ బస్టాండు శనివారం రాత్రి నుంచి ప్రయాణికులతో కాలు అడుగుపెట్టలేనంతగా కిక్కిరిసిపోయింది. వేలాది మంది తరలివచ్చారు. ఎటుచూసినా బస్సులు, జనంతో బస్టాండు ప్రాంగణం జాతరను తలపించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top