హోరున గాలివాన: యముడు లీవ్‌లో ఉన్నాడేమో, లేదంటే!

Cyclone Tauktae: Watch Mumbai Woman Narrow Escape From Falling Tree - Sakshi

సాక్షి, ముంబై: తౌక్టే తుపానుతో మహారాష్ట్ర, గుజరాత్‌, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కరోనాతో అల్లాడుతున్న ముంబై నగరంపై తౌక్టే మరింత తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోడ్లన్నీ జలమయ్యాయి. వరద తాకిడికి భారీ సంఖ్యలో చెట్లు, భవనాలు కూలిపోయాయి. ఈక్రమంలోనే ముంబైలో సోమవారం వెలుగుచూసిన ఓ ఘటన భయంగొల్పేదిగా ఉంది. ఈ వీడియో దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

వీడియో ప్రకారం..  వర్షం పడుతుండటంతో ఓ యువతి గొడుగు పట్టుకుని రోడ్డు వెంట వెళుతోంది. అంతలోనే మరింత గాలి వీయడం, వర్షం కురియడంతో ఆమె తన గొడుగుని ఇంకాస్త అడ్డుగా పెట్టుకుని ముందుకు కదిలింది. అయితే, ఆమెకు అతి సమీపంలో, రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం గాలి వాన ప్రభావంతో ఒక్కసారిగా అడ్డంగా విరిగింది. గొడుగు అడ్డు పెట్టుకుని అటువైపుగా వెళ్తున్న ఆ యువతి ప్రమాదాన్ని గ్రహించి.. క్షణ కాలంలో అక్కడ ఉంచి పరుగెత్తింది. 

దాంతో చెట్టు భాగాలు ఆమెకు అడుగు దూరంలో నేలకూలాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఈరోజు యమధర్మరాజుకు సెలవు. లేదంటే ఆ యువతి ప్రాణాలు హరీ మనేవి’ అని ఒకరు... ‘క్షణకాలం ఆలస్యమైతే ఆమె పరిస్థితి ఏమయ్యేదో. ఊహించేందుకే భయంగా ఉంది’ అని మరొకరు కామెంట్లు చేశారు. అదృష్టం అంటే ఇదే మరి, అప్రమత్తంగా వ్యవహరించి అపాయం నుంచి గట్టెకింది అని మరొకరు అన్నారు. తనకు కూడా ఇటువంటి అనుభవం ఎదురైందని ఓ నెటిజన్‌ వీడియో షేర్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top