మహోగ్రరూపం దాల్చిన బిపర్‌జాయ్‌ : రాకాసి అలలు.. భారీ వర్షాల హెచ్చరికలు..అంతటా హైఅలర్ట్‌

Cyclone Biparjoy Updates: Mumbai Flights Delayed Gujarat Alerted - Sakshi

ముంబై/ అహ్మదాబాద్‌: తీవ్ర తుపాను కాస్త అతితీవ్ర తుపాన్‌గా మారే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  అరేబియా సముద్రంలో మొదలైన బిపర్‌జోయ్‌ తుపాను మహోగ్ర రూపం దాల్చి దిశ మార్చుకుంటోంది. గుజరాత్‌ వైపు దూసుకెళ్తోంది తుపాను. అయితే తుపాను ప్రభావంతో తీరంలో అలలు ఎగసిపడుతుండగా.. భారీగా ఈదురు గాలులు, వర్షం ముంబై నగరాన్ని ముంచెత్తుత్తోంది. 

ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం నుంచి ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోంది. ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు విమానలు రద్దు అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇక బిపర్‌జాయ్‌ తుపాన్‌ గుజరాత్‌ వైపు వేగంగా వెళ్తోంది. జూన్‌ 15వ తేదీన గుజరాత్‌ తీరాన్ని తాకనుంది.   గుజరాత్ తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలుండ్చొని అంచనా వేస్తోంది.  సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ద్వారక వద్ద రాకాసి అలలు భయపెడుతున్నాయి.  జూన్ 15వ తేదీ వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి.   

గుజరాత్ లోని మాండవి- పాకిస్థాన్ లోని కరాచీల మధ్య బిపోర్‌ జాయ్‌ తీరందాటనున్న నేపథ్యంలో సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.  తీరాన్ని తాకే సమయంలో తీరంవెంబడి 125 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటిదాకా  అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్లలో ఇది రెండవ బలమైన తుపానుగా పేర్కొంది. మరోవైపు బిపర్‌జోయ్‌ ఎఫెక్ట్‌తో బీచ్‌లో సముద్రం ముందుకు దూసుకొచ్చిన వీడియో ఒకటి వైరల్‌ అవుతుండగా.. అది అధికారికంగా బిపర్‌జోయ్‌దేనా ధృవీకరణ కావాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top