కోవిడ్‌ టీకా పాలసీపై సోనియా గాంధీ ఆగ్రహం

Covid: Sonia Gandhi requests PM to reverse new vaccination policy - Sakshi

న్యూఢిల్లీ: మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన కోవిడ్‌ టీకా విధానం పూర్తి వివక్షాపూరితంగా ఉందని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి నిరంకుశ విధానాలతో నిండిన ఈ టీకా పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ అంశంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని సోనియా కోరారు. ఈ మేరకు సోనియా గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.

18-45 ఏళ్ల లోపు భారతీయులందరికీ ఉచితంగా కోవిడ్‌ టీకా అందివ్వాలనే బాధ్యత నుంచి మోదీ సర్కార్‌ తప్పుకుంది. యువత పట్ట ఈ ప్రభుత్వం వైఖరి ఏంటో ఇక్కడే తెలుస్తోంది. ప్రజలందరికీ ఒకే ధరకు టీకా ఇవ్వాలని బాధ్యత గల వ్యక్తులెవరైనా ఆలోచిస్తారు. కానీ ప్రభుత్వం ఆ బాధ్యతను నుంచి తప్పుకుంది అని సోనియా గాంధీ ఆ లేఖలో ఆరోపించారు. “ప్రస్తుత టీకా పాలసీ దేశంలోని అందరికీ అనువుగా లేదు. ఏడాదిగా కోవిడ్‌ నేర్పిన పాఠాలు, పౌరులు బాధలను చూసి కూడా మోదీ సర్కార్‌ ఇలాంటి వివక్షాపూరిత టీకా విధానం తేవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో ప్రస్తుత సవాళ్లు తగ్గకపోగా మరింత జఠీలమవుతాయి అని సోనియా అభిప్రాయపడ్డారు.

కోవిడ్‌ టీకాల తయారీ సంస్థ అయిన సీరమ్‌ సంస్థ తాజాగా వేర్వేరు ధరల శ్రేణిని ప్రకటించిన విషయాన్ని సోనియా ప్రస్తావించారు.కేంద్ర ప్రభుత్వానికి డోస్‌కు రూ.150 చొప్పున, రాష్ట్ర ప్రభుత్వాలకు డోస్‌కు రూ.400, ప్రైవేట్‌ ఆస్పత్రులకు డోస్‌కు రూ.600 చొప్పున విక్రయిస్తామని సీరమ్‌, సంస్థ చెబుతోంది. ఇలా వేర్వేరు ధరలు ఉండటంతో పౌరులు అత్యధిక ధర చెల్లించి టీకాలను కొనాల్సిన దుర్భర పరిస్థితి తలెత్తింది. అధిక ధరకే రాష్ట్ర ప్రభుత్వాలూ కొనాల్సి రావడంతో రాష్ట్రాలకూ ఆర్థికంగా పెనుభారం అని సోనియా గాందీ కేంద్రప్రభుత్వంపై అగ్రహం వ్యక్తంచేశారు. 

ఒకే కంపెనీ తయారుచేసే ఒక ల కోవిడ్‌ టీకాకు ఇలా మూడు వేర్వేరు ధరలు ఎందుకు నిర్ణయించారు? దీనికి సహేతుకమైన కారణాలే లేవు. ప్రజల దుర్భర కోవిడ్‌ పరిస్టితుల నుంచి లాభాలను పొందాలని చూస్తున్న వారికి అనువుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్స్కు కొరత, ఆక్సిజన్‌ సరఫరా కొరత, అత్యవసర బెషధాల నిల్వలు వేగంగా తగ్గిపోతున్న ఈ తరుణంలో ఏమాత్రం స్పృహలేకుండా ప్రభుత్వం ఎందుకు ఈ పాలసీని తీసుకొచ్చింది? అని సోనియా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం టీకా లభ్యత ఉన్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు టీకాల సరఫరాను పూర్తి పారదర్శకంగా చేపట్టాలని కోరారు.

పనికిరాని ప్రసంగాలొద్దు.. పనికొచ్చే పరిష్కారం కావాలి
దేశంలో ప్రస్తుత సంక్షోభానికి కరోనా వైరస్‌ మాత్రమే కారణం కాదని, మోదీ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలూ కారణమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. "హోం క్వారంటైన్‌లో ఉన్న నాకు చెడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కోవిడ్‌ కట్టడిపై కేంద్రం పనికీరాని ప్రసంగాలు, వివరణలు ఆపాలి దేశానికి పనికొచ్చే పరిష్కారం చూపాలి" అని గురువారం రాహుల్‌ ట్వీట్‌ చేశారు. "పేద ప్రజలంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక సంఖ్యలాగానే కనిపిస్తుంది. కానీ వారు భారతీయ పౌరులు మధ్య తరగతి ప్రజలంతా పేదరికం బారిన పడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంతటి విధ్వంసం చేయాలో అంతా చేస్తోంది" అని పేర్కొన్నారు.

చదవండి: పనిచేయకుండానే 15 ఏళ్లుగా జీతం తీసుకుంటున్న ఉద్యోగి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top