కోవిడ్‌ రోగి శవపరీక్షలో ఆసక్తికర విషయాలు వెల్లడి

Covid Patient Lungs Found Hard as Leather Ball in Autopsy - Sakshi

బెంగళూరు: కరోనా మహమ్మారి గురించి రోజుకొక షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇలాంటి వార్త మరొకటి తెలిసింది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి ఊపిరితిత్తులు లెదర్‌ బాల్‌ కన్నా స్ట్రాంగ్‌గా మారినట్లు శవపరీక్షలో తెలిసింది. వివరాలు.. కర్ణాటకకు చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఒకరు కరోనా బారిన పడి మరణించారు. ఈ క్రమంలో అతడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. దానిలో సంచలన విషయాలు తెలిశాయి. సదరు వ్యక్తి మరణించిన 18 గంటల తర్వాత కూడా అతడి గొంతు, ముక్కులో నుంచి సేకరించిన స్వాబ్‌ శాంపిల్స్‌లో వైరస్‌ ఉనికిని గుర్తించారు. ఈ సందర్భంగా శవపరీక్ష నిర్వహించిన ఆక్స్‌ఫర్డ్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దినేష్ రావు మాట్లాడుతూ, రోగి ఊపిరితిత్తులు "తోలు బంతిలాగా గట్టిగా ఉన్నాయి".. రక్త నాళాలలో గడ్డలు ఏర్పడ్డాయని తెలిపారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి శవపరీక్ష వ్యాధి పురోగతిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అని తెలిపారు. అక్టోబర్‌ 10న ఈ శవపరీక్ష నిర్వహించామన్నారు. ఇది పూర్తి కావడానికి 1.10గంటల సమయం పట్టిందన్నారు డాక్టర్‌ రావు. (చదవండి: వ్యాక్సిన్‌ మొదట వారియర్స్‌కే! )

కరోనాతో మృతి చెందిన రోగి శరీరం.. అతడి మరణం తర్వాత కూడా వైరస్‌ వ్యాప్తికి అనుకూలంగా ఉందని నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక డాక్టర్‌ రావు శవ పరీక్ష నిర్వహించడం కోసం సదరు రోగి  ముక్కు, గొంతు, నోరు, ఊపిరితిత్తుల ఉపరితలం, శ్వాసకోశ మార్గాలు, ముఖం, మెడపై చర్మం నుంచి ఐదు శాంపిల్స్‌ని తీసుకున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో ముక్కు, గొంతులో నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. అంటే కోవిడ్‌ రోగి శరీరం మరణం తర్వాత వైరస్‌ వ్యాప్తికి అనుకూలంగా ఉందన్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చర్మం మీద నుంచి సేకరించిన శాంపిల్స్‌ నెగిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. ఇక కుటుంబ సభ్యుల అనుమతితోనే ఈ శవపరీక్ష నిర్వహించినట్లు డాక్టర్‌ రావు తెలిపారు. రోగి మరణించిన సమయంలో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నారని.. మృత దేహాన్ని తీసుకెళ్లలేదన్నారు. ఇక ఇటీవల కాలంలో అమెరికా, ఇటలీలో శవపరీక్ష నివేదికలలో కనిపించిన ఫలితాలకు.. తాను నిర్వహించిన పరీక్ష ఫలితాలకు చాలా తేడా ఉందన్నారు డాక్టర్‌ రావు. దీన్ని బట్టి చూస్తే.. భారతదేశంలో కనిపించే వైరస్‌ జాతులు భిన్నంగా ఉన్నాయన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top