
లక్నో: ప్రముఖ రామకథ కథకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత జగద్గురు రామభద్రాచార్యపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అభ్యంతరక వీడియోలను 48 గంటల్లోగా తొలగించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మెటా, గూగుల్‌లను ఆదేశించింది. జస్టిస్ శేఖర్ బీ సరాఫ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. శరద్ చంద్ర శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
రామభద్రాచార్యపై అభ్యంతరకరంగా రూపొందించిన వీడియోల తొలగింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు సోషల్ మీడియా కంపెనీలకు సంబంధిత యూఆర్‌ఎల్ లింక్‌లను అందించాలని కోర్టు పిటిషనర్లను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 11కి వాయిదా వేశారు. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల దివ్యాంగ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన జగద్గురు స్వామి రామభద్రాచార్యను అవమానపరుస్తూ శశాంక్ శేఖర్ అనే వ్యక్తి యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.
రామభద్రాచార్య అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆ వీడియోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయని, వాటిని తొలగించడానికి సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించేందుకు నిబంధనలను రూపొందించి, కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషన్ కోరింది. ఈ కంటెంట్ పరువు నష్టం కలిగించేలా ఉండటమే కాకుండా, రామభద్రాచార్య కంటి చూపు కోల్పోవడాన్ని ఎగతాళి చేసేలా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్ర వికలాంగుల కమిషనర్ కార్యాలయం ఈ అంశాన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకుని, శేఖర్‌కు నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 18న అతను కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.