నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్.. బయటకు వస్తే వాహనాలు సీజ్

సాక్షి బళ్లారి: జిల్లాలో కరోనా అదుపులోకి రాకపోవడంతో జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌కు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్‌లో కొద్దిమేర మరిన్ని కఠిన ఆంక్షలు చేపట్టారు. నేటి (బుధవారం) నుంచి ఐదు రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్ అమల్లోకి వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే బయటకు అనుమతి ఉంటుంది. అటు తరువాత పూర్తిగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. అత్యవసర సేవలు మినహా మెడికల్ స్టోర్స్, ఆస్పత్రులకు, పాల విక్రయాలకు మినహాయింపు ఇచ్చి మిగిలిన అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాధికారి హెచ్చరించారు. అత్యవసరం మినహా ఎవరూ బయటకు రాకూడదన్నారు.
వాహనాలు సీజ్ చేస్తాం
బళ్లారిటౌన్: జిల్లాలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న కారణంగా అనవసరంగా ఎవరైనా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్‌పీ సైదులు అడావత్ హెచ్చరించారు. ఇప్పటి వరకు 600 వాహనాలను సీజ్ చేశామని, వారిపై కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపామన్నారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ఉన్నందున ప్రజలు కోవిడ్ నియంత్రకు సహకరించాలని కోరారు.