జూన్‌లో నూతన అధ్యక్షుడు

Congress party to elect party president by June 2021 - Sakshi

సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం

అర్ణబ్‌ గోస్వామి వివాదాస్పద వాట్సాప్‌ చాట్‌లపై జేపీసీకి డిమాండ్‌

రైతు ఆందోళనలపై ప్రభుత్వ తీరును ఖండించిన సోనియా

సాక్షి,న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడు నెలల్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేప«థ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికను జూన్‌లో నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకు మేలో అ«ధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్‌ నెలాఖరు వరకు వాయిదా వేశారు. శుక్రవారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సీనియర్‌ నేత మధుసూదన్‌ మిస్త్రీ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రసంగంతో ప్రారంభమైంది. రైతు ఆందోళ నలపై కేంద్రం అత్యంత దారుణంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. రైతు ప్రతినిధులతో చర్చల్లో ప్రభుత్వ అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెం ట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియా  దిశానిర్దేశం చేశారు.

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ నిలబ డాలని, దేశవ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అంతేగాక కోవిడ్‌–19 విషయంలో టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను అభినందించడంతో పాటు,  పంపిణీ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రజలు వాక్సినేషన్‌కు ముందుకు రావాలని  తీర్మానం చేసింది. అలాగే, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా పంపిణీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న  ప్రణాళికలను బహిర్గత పరచాలని కోరింది. దేశ రక్షణకు సంబం ధించిన వ్యాఖ్యలతో బహిర్గతమైన రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామి వాట్సాప్‌ చాట్‌ వ్యవహారంపై జేపీసీ విచారణకు డిమాండ్‌ చేస్తూ  మరో తీర్మానం చేసింది.

గహ్లోత్‌ సీరియస్‌
సీడబ్ల్యూసీ సమావేశంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మలపై రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని సమాచారం. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదా అని గహ్లోత్‌ ప్రశ్నించారు. గతేడాది ఆగస్టు 24న జరిగిన సమావేశంలోనూ ఆజాద్, శర్మ తదితర నాయకులు పార్టీ అధినేత్రిని ఉద్దేశించి రాసిన ఒక లేఖలో లేవనెత్తిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ లేఖ బహిర్గతం అయినప్పటినుంచి పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొనసాగుతున్న విష యం తెలిసిందే.ఆ లేఖపై సంతకం చేసిన నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని గత సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీ ఆరోపణలపై ఆజాద్, కపిల్‌ సిబల్‌ అభ్యంత రం వ్యక్తం చేసిన తరువాత, కాంగ్రెస్‌ అధిష్టా నం డ్యామేజ్‌ కంట్రోల్‌ మోడ్‌లోకి వెళ్లింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top