సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్‌ ఎంపీలు.. హాట్‌ టాపిక్‌గా మారిన లేఖ!   

Congress MPs Seek Transparency In Congress President Poll - Sakshi

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవల కాలంలో సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు. ఇటీవలే సీనియర్‌ నేత గులాం​ నబీ ఆజాద్‌ సైతం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి విషయంలో అధిష్టానం వైఖరిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా.. ఇప్పటికీ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నికపై తీవ్ర ఉ‍త్కంఠ నెలకొంది. కాగా, అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్ష ఎన్నిక నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు.. ఏఐసీసీ ఎన్నికల చీఫ్‌ మధుసూధన్‌ మిస్త్రీకి లేఖ రాయడం పొలిటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎంపీలు శ‌శిథ‌రూర్‌, మనీష్‌ తివారీ, కార్తి చిదంబ‌రం, ప్ర‌ద్యూత్ బోర్డోలై, అబ్దుల్ ఖ‌లీక్‌లు లేఖ‌ను రాశారు.

సదరు లేఖలో పార్టీ అధ్యక్ష ఎన్నిక‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని కోరారు. ఎల‌క్టోర‌ల్ బాండ్లకు చెందిన అంశంపై త‌ప్పుడు స‌మాచారం వెళ్ల‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఎంపీలు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొనే ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌తినిధుల‌తో కూడిన ఎల‌క్టోర‌ల్ కాలేజీని రిలీజ్ చేయాల‌ని ఎంపీలు త‌మ లేఖ‌లో డిమాండ్ చేశారు. ఇక, సొంత పార్టీ నేతలే ఇలా లేఖ రాయడంతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు మరోసారి షాక్‌ తగిలినట్టు అయ్యింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top