మిశ్రాను పదవి నుంచి తప్పించండి

Congress demands removal of MoS Ajay Mishra - Sakshi

‘లఖీమ్‌పూర్‌’పై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కాంగ్రెస్‌ నేతల విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనకు బాధ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ప్రియాంకా గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌ తదితరులతో కూడిన కాంగ్రెస్‌ బృందం బుధవారం రాష్ట్రపతి రామ్‌నా«థ్‌ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాజ్యాంగ సంరక్షకుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది.

అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖీమ్‌పూర్‌ ఘటనపై పూర్తి వివరాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రధాన నిందితుడి తండ్రి కేంద్రంలో మంత్రిగా ఉండడం వల్ల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని భావిస్తున్నామని అన్నారు. అందుకే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీలతో జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. అజయ్‌ రాజీనామాతో బాధితులకు న్యాయం జరుగుతుందని రాహుల్‌ అన్నారు. ‘సెప్టెంబరు 27న నిరసన తెలుపుతున్న రైతులను అజయ్‌ మిశ్రా బహిరంగంగా బెదిరించారు. మంత్రే ఇలా రెచ్చగొడితే న్యాయం ఎలా లభిస్తుంది?  ఘటనలో అజయ్‌  కొడుకు ఆశిష్‌ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి’ అని వినతి పత్రంలో నేతలు పేర్కొన్నారు.
 
ఆశిష్‌కు బెయిల్‌ నిరాకరణ
లఖీమ్‌పూర్‌ ఖేరి: లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాకాండ ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు ఆశిష్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ కేసులో అంకిత్‌ దాస్, లతీఫ్‌ అలియాస్‌ కాలే అనే ఇద్దరు వ్యక్తులను సిట్‌ బుధవారం అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టింది. వారిని 14 రోజులపాటు జ్యుడీíÙయల్‌ రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆశిష్‌ మిశ్రాతోపాటు అతడి సహచరుడు ఆశిష్‌ పాండేకు బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ చింతా రామ్‌ తిరస్కరించారని సీనియర్‌ ప్రాసిక్యూషన్‌ ఆఫీసర్‌ ఎస్‌.పి.యాదవ్‌ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top