Congress chintan shivir: ప్రజలతో బంధం తెగింది

Congress chintan shivir: Bonding with people says rahul gandhi - Sakshi

వారికి మళ్లీ దగ్గరవుదాం: రాహుల్‌

ఉదయ్‌పూర్‌ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: దేశ ప్రజలతో కాంగ్రెస్‌ బంధం తెగిపోయిందని పార్టీ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొని బలోపేతం చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అక్టోబర్‌లో దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. చింతన్‌ శిబిర్‌లో ముగింపు సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక కుటుంబం, ఒకే టికెట్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉద్ఘాటించారు.

ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది పార్టీ కోసం పనిచేయకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరని అన్నారు.  ‘‘నేను మీ కుటుంబం, మీరు నా కుటుంబం. ఇది ఒక కుటుంబం. నా పోరాటం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంపైనే. అది దేశానికి ముప్పుగా మారింది. మనం కేవలం ఒక రాజకీయ పార్టీతో కాదు, దేశంలో అతిపెద్ద క్రోనీ క్యాపిటలిస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం’’ అని చెప్పారు.  బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి శక్తులకు తాను భయపడనని పేర్కొన్నారు. ‘‘నేను జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. భరతమాత నుంచి ఒక పైసా కూడా తీసుకోలేదు. కాబట్టి నాకు భయం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

ప్రత్యర్థుల దగ్గర ఎక్కువ డబ్బులున్నాయ్‌
రానున్నది చాలా కఠినమైన పోరాటమని రాహుల్‌ చెప్పారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని తెలిపారు. భారతదేశ సంస్థాగత నిర్మాణాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ సంస్థలు పని చేయడం మానేసిన రోజు మనమంతా తీవ్రమైన ఇబ్బందుల్లో పడతామన్నారు. ఇప్పటికే అలాంటి పరిస్థితులు చూస్తున్నామని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రజలతో కలిసి పోరాడటం, వారికి అండగా నిలవడం కాంగ్రెస్‌ బాధ్యత అని వివరించారు.

నాయకుల దృష్టి అంతా ప్రజా సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంపైనే ఉండాలన్నారు. పార్టీ కోసం కాకుండా దేశం కోసం నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెమట చిందించాల్సిందేనని.. ఇది కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని ఉద్ఘాటించారు. రాజకీయ ప్రత్యర్థులను అధిగమించేలా పని చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు రాహుల్‌ పిలుపునిచ్చారు. మన దగ్గరి కంటే ప్రత్యర్థుల వద్దే ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పారు. అందుకే వారిలాగా ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగతంగా యువత, సీనియర్లతో కూడిన మిశ్రమ నాయకత్వం ఉండాలని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top