ఎన్నికల ఎఫెక్ట్‌.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’ | Congress Chidambaram Says 6 lakh voter addition in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఎఫెక్ట్‌.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’

Aug 3 2025 3:40 PM | Updated on Aug 3 2025 4:51 PM

Congress Chidambaram Says 6 lakh voter addition in Tamil Nadu

ఢిల్లీ: ఓటర్‌ లిస్టు విషయంలో ఎన్నికల సంఘంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మరో బాంబు పేల్చారు. తమిళనాడులో ఏకంగా  6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని చెప్పుకొచ్చారు. దీంతో ఓటర్‌ లిస్ట్‌పై కొత్త చర్చ మొదలైంది.

బీహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఓటర్ల సంఖ్య పెరిగిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం తెలిపారు. తాజాగా చిదంబరం ట్విట్టర్‌ వేదికగా.. ‘ఎస్ఐఆర్‌ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోంది. బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా.. తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది ఆందోళనకరమైన చర్య. చట్టవిరుద్ధమైనది. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులు అని పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్లు అవుతుంది. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిందే’ అని పిలుపునిచ్చారు.

ప్రతి భారతీయుడికి శాశ్వత నివాసం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా నివసించడానికి, పని చేయడానికి హక్కు ఉంది. అది స్పష్టంగా సరైనది. బీహార్ ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న లక్షల మంది వ్యక్తులు రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు. కాబట్టి వారిని మినహాయించాలని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయానికి వచ్చింది?. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు అని నిర్ధారణకు రాక ముందే, ప్రతి కేసుపై సమగ్ర విచారణ నిర్వహించకూడదా?. సామూహిక ఓటుహక్కుల తొలగింపు అనేది తీవ్రమైన సమస్య, అందుకే సుప్రీంకోర్టు పిటిషన్లను విచారిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిదంబరం తన పోస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement