
బెంగళూరు: కోవిడ్-19 మహమ్మారి విషయంలో స్పందించడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ప్రభుత్వ, ప్రజా సేవల సంస్థలు ప్రభావవంతంగా ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. ఈవై కనెక్టెడ్ సిటిజన్ సర్వేలో ఈ విషయాన్ని 80 శాతం మంది అంగీకరించారు. 12 దేశాల్లో 12,100 మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో భారత్ నుంచి 1,000 మందికిపైగా 18-50 ఏళ్ల వయసున్నవారు ఉన్నారు. ‘ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరడంలో సాంకేతిక ఆవిష్కరణల పాత్ర కీలకం. సాంకేతికత ప్రజా సేవలను మెరుగ్గా మారుస్తుందని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. మహమ్మారి కారణంగా భవిష్యత్తులో దైనందిన జీవితంలో టెక్నాలజీ వినియోగం అధికమవుతుందని 71 శాతం మంది తెలిపారు. ప్రజా సేవలు పొందడానికి తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి ఇవ్వడానికి 63 శాతం మంది సమ్మతి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కలిసేబదులు టెక్నాలజీని వినియోగించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆర్టిఫీషియల్ ఆధారిత చాట్ బోట్ ద్వారా ప్రభుత్వంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. పెన్షన్ ప్రణాళిక, వ్యాపారాల ఏర్పాటుకు వనరుల సమాచారం వంటివి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు’ అని సర్వేలో తేలింది.