తమిళ రాజకీయాల్లో మూడుముక్కలాట! | CM Vijay TVK, DMK, BJP: Why Kamaraj's Legacy Matters Again? | Sakshi
Sakshi News home page

తమిళ రాజకీయాల్లో మూడుముక్కలాట!

Oct 7 2026 11:32 AM | Updated on Oct 7 2026 11:40 AM

CM Vijay TVK, DMK, BJP: Why Kamaraj's Legacy Matters Again?

ఓ పాత పేరు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. అది విద్యా సంస్కరణలకు గుర్తుగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజ్‌. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత సి. జోసెఫ్‌ విజయ్‌ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి కామరాజ్‌ పేరు పెట్టడం.. ఆ తర్వాత మరింత మంది విద్యార్థులకు విస్తరించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. 2022లో డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన పథకానికి ఇప్పుడు కొత్త పేరు, కొత్త రాజకీయ గుర్తింపు రావడంతో.. సంక్షేమ పథకాల క్రెడిట్‌ విషయంలో డీఎంకేతో విజయ్‌కు మరో పోటీ మొదలైనట్టయింది. అదే సమయంలో కామరాజ్‌ వారసత్వం బీజేపీకి కూడా ఓ రాజకీయ అవకాశంగా మారుతోంది.

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2022 సెప్టెంబర్‌లో ‘చీఫ్‌ మినిస్టర్స్‌ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌’ను ప్రారంభించారు. తొలుత 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేలా పథకాన్ని రూపొందించారు. విద్యార్థుల హాజరు, పోషకాహారం మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశాలు. విజయ్‌ ప్రభుత్వం జూలైలో దీనికి ‘పెరుంతలైవర్‌ కామరాజర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌’గా పేరు మార్చింది. సెప్టెంబర్‌ 22న 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించింది. దీంతో మరో 15.30 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా 15,454 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు పథకం చేరింది. ఇందుకోసం అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించారు.

అయితే పేరు మార్పుపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకానికే పేరు మార్చి కొత్త ప్రభుత్వం రాజకీయ క్రెడిట్‌ తీసుకుంటోందని డీఎంకే నేత ఈవీ వేలు విమర్శించారు. కామరాజ్‌ను గౌరవించడంపై తమకు అభ్యంతరం లేదని.. కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన పేరు పెట్టవచ్చని వ్యాఖ్యానించారు.

అసలు విజయ్‌ లెక్క ఇదేనా?
ఇక్కడే విజయ్‌ నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యం వస్తోంది. డీఎంకేకు సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం వంటి అంశాలు చాలాకాలంగా బలమైన రాజకీయ గుర్తింపుగా ఉన్నాయి. ఇప్పుడు అదే సంక్షేమ విధానాలను కొనసాగిస్తూనే.. వాటికి తనదైన పేరు, గుర్తింపును జోడించడం ద్వారా విజయ్‌ ప్రత్యామ్నాయ రాజకీయ బ్రాండ్‌ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది.

కామరాజ్‌ పేరు ఎంపిక కూడా ఇందులో కీలకమే. విద్య, పాఠశాలల విస్తరణ, విద్యార్థుల సంక్షేమంతో ఆయన పేరు తమిళ ప్రజల్లో బలంగా ముడిపడి ఉంది. పేద పిల్లల విద్యపై ఆయనకు ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుంటే.. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకానికి ఆయన పేరు పెట్టడం ద్వారా తన పాలనను ఆ వారసత్వంతో అనుసంధానించుకునే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు.

కుల సమీకరణాల కార్డుగా?
కామరాజ్‌కు నాడార్‌ సమాజంతో ఉన్న చారిత్రక అనుబంధం కూడా ఈ నిర్ణయానికి మరో రాజకీయ కోణాన్ని తెస్తోంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో సామాజిక వర్గాల ప్రాధాన్యం నేపథ్యంలో.. కామరాజ్‌ పేరును ముందుకు తేవడం ద్వారా ఆ వర్గాలతో పాటు విస్తృత సామాజిక సమీకరణాలను ఆకర్షించే ప్రయత్నంగా కొందరు విశ్లేషకులు చూస్తున్నారు. అయితే దీనివల్ల తక్షణమే ఓట్ల లాభం వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవు. అందుకే ఈ పేరు మార్పును కేవలం పథకం రీబ్రాండింగ్‌గా చూడటం కంటే.. విజయ్‌ తన రాజకీయ గుర్తింపును విస్తరించుకునే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుందనే కోణమూ చర్చనీయాంశమైంది.

బీజేపీకి ఎక్కడ అవకాశం?
కామరాజ్‌ తమిళ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్‌తో బలంగా అనుసంధానమైన నాయకుడు. అయినప్పటికీ విద్య, సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం వంటి అంశాల్లో ఆయనకు ఉన్న గుర్తింపు రాజకీయంగా విస్తృతంగా ఉపయోగపడేలా ఉంది. ఇటీవల కామరాజ్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన విద్య, సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమానికి చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

ఇటు బీజేపీకి కూడా ఇందులో ఓ రాజకీయ కోణం కనిపిస్తోంది. చారిత్రక నాయకుడైన కామరాజ్‌ను కేవలం ఒక పార్టీకి పరిమితమైన నేతగా కాకుండా.. విద్య, అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రతీకగా ప్రస్తావించడం ద్వారా తమిళనాడులో తన రాజకీయ కథనానికి అనుసంధానించే అవకాశం బీజేపీకి ఉంటుంది.

కామరాజ్‌ పేరుతో కేంద్ర స్థాయిలో ఓ పథకం తీసుకురావాలని ప్రధాని మోదీని కోరుతూ ఓ బృందం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే జరిగితే.. రాష్ట్రంలో విజయ్‌ ప్రభుత్వం కామరాజ్‌ పేరును ముందుకు తీసుకెళ్తున్న సమయంలో, కేంద్రంలో బీజేపీ కూడా ఆయన వారసత్వాన్ని తనదైన రీతిలో ప్రస్తావించినట్లవుతుంది. కాబట్టి, టీవీకే, డీఎంకేలా కాకుండా బీజేపీ కామరాజ్‌ వారసత్వాన్ని తమిళనాడులో తన రాజకీయ విస్తరణకు ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

కామరాజ్‌ పేరు చుట్టూ ఇప్పుడు మూడు రాజకీయ లెక్కలు కనిపిస్తున్నాయి. విజయ్‌ తనదైన సంక్షేమ, సామాజిక రాజకీయ బ్రాండ్‌ కోసం చూస్తుంటే.. డీఎంకే తన పథకాలకు ఉన్న రాజకీయ క్రెడిట్‌ను కాపాడుకోవాల్సి వస్తోంది. బీజేపీ మాత్రం కామరాజ్‌ వారసత్వాన్ని తమిళనాడులో తనకు అనుకూలమైన రాజకీయ స్పేస్‌గా మలుచుకునే అవకాశం కోసం చూస్తోంది. ఈ లెక్కలు చివరికి ఎన్నికల ఓట్లుగా మారుతాయా? లేక కామరాజ్‌ పేరు మరో రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా? అన్నదే ఇప్పుడు అసలు ఆసక్తి.

ఇదీ చదవండి: ఆ హీరో కూడా పాలిటిక్స్‌కు వస్తే.. ఇక అంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement