బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా!

CM Stalin Gifts Cycle To Boy Who Donates Savings To Covid Relief Fund - Sakshi

ఇదే తమిళనాడు ప్రజల బలం:  ఎంకే స్టాలిన్‌

సాక్షి, చెన్నై: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఆక్సిజన్‌ కొరతతో రోజూ వందల మంది ప్రాణాలు విడిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు, మల్టీనేషనల్‌ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలను ఇచ్చాయి. రియల్ హీరో సోనూసూద్  ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన హరిశ్వర్మాన్ అనే బాలుడు తన కోసం సైకిల్‌ కొనడానికి డబ్బులు దాచుకున్నాడు. అయితే ఆ డబ్చును  కోవిడ్‌-19 నివారణ రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చాడు. దీంతో బాలుడి దాన గుణానికి మెచ్చిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ హరిశ్వర్మాన్‌కు బహుమతిగా కొత్త సైకిల్‌ను ప్రదానం చేశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తమిళనాడు సీఎం బహుమతిగా ఇచ్చిన కొత్త సైకిల్‌ను నడుపుతున్న వీడియోని మే 9న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ఇప్పటివరకు రెండు లక్షల మంది వీక్షించారు. హరిశ్వర్మాన్ దాన గుణానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘‘హరిశ్వర్మాన్ అనే బాలుడు తన కోసం సైకిల్‌ కొనడానికి దాచుకున్న డబ్బును కోవిడ్‌-19 నివారణ రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చాడు. అది నన్ను కదిలించింది. నేను ఆ బాలుడికి బహుమతిగా కొత్త సైకిల్‌ ఇస్తున్నాను. ఇదే తమిళనాడు ప్రజల బలం.’’ అని సీఎం అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా తమిళనాడులో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న లాక్‌డౌన్ విధించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14.1 లక్షల కేసులు నమోదు కాగా..12.6 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా15,880 మంది మరణించారు.

(చదవండి:  నెటిజన్లను మెప్పిస్తున్న పెంగ్విన్లు: వైరల్‌ వీడియో)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top