జైళ్లలోని 80% మంది విచారణ ఖైదీలే

CJI Ramana flags issue of large population of undertrials in jails - Sakshi

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

జైపూర్‌: దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉండటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు వ్యక్తుల నిర్బంధానికి దారితీస్తున్న విధానాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో సుమారు 80% మంది అండర్‌ ట్రయల్‌ ఖైదీలేనన్నారు. శనివారం సీజేఐ జైపూర్‌లో ఆల్‌ ఇండియా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ 18వ వార్షిక సదస్సులో పసంగించారు. న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ పాల్గొన్నారు. కారాగారాలను బ్లాక్‌ బాక్సులుగా పేర్కొన్న సీజేఐ.. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ఖైదీల్లో జైలు జీవితం ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు.

విచారణ ఖైదీలను ముందుగా విడుదల చేయడమనే లక్ష్యానికి పరిమితం కారాదని పేర్కొన్నారు. ‘‘నేర న్యాయ వ్యవస్థలో, ప్రక్రియే ఒక శిక్షగా మారింది. అడ్డుగోలు అరెస్టులు మొదలు బెయిల్‌ పొందడం వరకు ఎదురయ్యే అవరోధాలు, విచారణ ఖైదీలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే ప్రక్రియపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం’’అని ఆయన అన్నారు.

దీంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, పోలీసులకు శిక్షణ, సున్నితత్వం పెంచడం వంటి వాటి ద్వారా క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థను మెరుగుపరచవచ్చని అన్నారు.  రాజకీయ వైరుధ్యం శత్రుత్వంగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయి’’అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ లాయర్లకే ఎక్కువ గౌరవం: రిజిజు
హైకోర్టులు, దిగువ కోర్టుల్లో కార్యకలాపాలు ప్రాంతీయ భాషల్లోనే జరిపేలా ప్రోత్సహించాలని కిరణ్‌ రిజిజు చెప్పారు. ఏ ప్రాంతీయ భాష కంటే ఇంగ్లిష్‌ ఎక్కువ కాదన్నారు. ఇంగ్లిష్‌ ధారాళంగా మాట్లాడగలిగినంత మాత్రాన లాయర్లు ఎక్కువ గౌరవం, ఎక్కువ ఫీజు పొందాలన్న విధానం సరికాదని చెప్పారు. కొందరు లాయర్లు ఒక్కో కేసుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇంత ఫీజును సామాన్యులు భరించలేరని చెప్పారు. సామాన్యుడిని కోర్టుల నుంచి దూరం చేసే కారణం ఎలాంటిదైనా ఆందోళన కలిగించే అంశమేనన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top