
నేపాల్‌లో భారీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి రాజీనామాకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నేపాల్ ఆర్మీ దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించింది. అనంతరం కర్ఫ్యూ ప్రకటించింది.
ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. ఈ క్రమంలో దేశంలోని ఆయా జైళ్ల నుంచి దాదాపు ఏడు వేల మంది ఖైదీలు పరారైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నౌబస్తాలో జువెనైల్ హోంలో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు బాలలు మృతి చెందారు. భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను లాక్కోవడంతో పాటు.. జైలు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో సిబ్బంది జరిపిన కాల్పుల్లో వారు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశవ్యాప్తంగా ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజార్ జైలు నుంచి 1,100 మంది, చిత్వన్-700, నక్కు-1,200, సున్సారి జిల్లా జుంప్కా జైలు-1,575.. కంచన్‌పూర్-450, కైలాలి-612, జలేశ్వర్-576, కాస్కి-773, డాంగ్-124, జుమ్లా-36, సొలుఖుంబు-86, గౌర్-260, బజ్హాంగ్ జైలు నుంచి 65 తప్పించుకున్నారు.
కాగా, సోషల్ మీడియా యాప్‌లపై నిషేధంతో పాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపు వేగంతో నేపాల్‌ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టం చేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు.