ఢిల్లీ: ‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం (మే 15న) జరిగిన విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కేసు విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.
ఓ పనికిమాలిన కేసు విచారణ సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. “నిన్న కేసు విచారణ సమయంలో నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా కొంత భాగం తప్పుగా చూపించిన తీరు చూసి బాధపడ్డాను. బార్ వంటి వృత్తుల్లోకి నకిలీ, బోగస్ డిగ్రీల సాయంతో వచ్చిన వారినే నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వారు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవనీయ వృత్తుల్లోకి చొరబడ్డారు. అందుకే వారిని పరాన్నజీవులతో పోల్చాను” అని సూర్యకాంత్ చెప్పారు.
కాగా, నిరుద్యోగ యువ న్యాయవాదులను బొద్దింకలుగా పేర్కొన్నారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. సీనియర్ హోదా కల్పించే ప్రక్రియపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కాలేదని ఆరోపిస్తూ న్యాయవాది సంజయ్ దూబే ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌పై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.
విచారణ సమయంలో సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం దూబేను ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది హోదా ప్రతిష్ఠకు గుర్తా లేదంటే న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యం సాధనమా? అని జోయ్‌మాల్యా బాగ్చి ప్రశ్నించారు.
ఆ సమయంలో “వృత్తిలో.. ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారు” అని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వారు సోషల్ మీడియా, ఆర్‌టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని చెప్పారు. నల్ల కోట్లు వేసుకున్న వేలాది మందిపై వారి డిగ్రీల విషయంలో అనుమానాలు ఉన్నాయని అన్నారు.
దీంతో, తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని శనివారం సూర్యకాంత్ స్పష్టం చేశారు. “దేశ యువతను నేను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారం. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మానవ వనరులపై నాకు గర్వంగా ఉంది. భారత యువత నాకు ఎంతో గౌరవం ఇస్తారు. నేనూ వారిని అభివృద్ధి చెందే భారతానికి స్తంభాలుగా చూస్తాను” అని తెలిపారు.


