ప్రధాని మోదీకి చినజీయర్‌ స్వామి ఆహ్వానం

Chinna Jeeyar Invites Modi For Ramanuja Statue Opening Ceremony In Hyderabad - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ప్రధాని మోదీని త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. శనివారం ఆయనతోపాటు మైహోం గ్రూపు చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని, అందులో పాల్గొని 216 అడుగుల భగవద్‌ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు. భేటీ అనంతరం వివరాలతో ప్రకటన విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజుల మహావిగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారని అందులో తెలిపారు. ‘‘శ్రీరామానుజుల దివ్యత్వం ప్రధానికి తెలుసు. ఆయన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట బురుజు నుంచి రామానుజుల వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు.

శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సంరంభానికి రావాలని, 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని చినజీయర్‌ స్వామి ఆహ్వానించగా.. ప్రధాని మోదీ అంగీకరించారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో  రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమంటూ..చినజీయర్‌ స్వామి సంకల్పాన్ని కొనియాడారు’’ అని వెల్లడించారు. 

పెద్దలందరికీ ఆహ్వానం 
ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, కిషన్‌రెడ్డి, నితిన్‌ గడ్కరీ ఇతర కేంద్రమంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లను చినజీయర్‌ స్వామి స్వయంగా కలిసి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 

1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగం 
ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1,035 హోమగుండాలతో ఈ యాగం చేస్తారు. 2 లక్షల కిలోల ఆవునెయ్యితోపాటు ఇతర హోమ ద్రవ్యాలను వినియోగించనున్నారు.

చదవండి:  2.5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు చూసి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top