సెప్టెంబర్‌కల్లా పిల్లలకు వ్యాక్సిన్‌! | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌కల్లా పిల్లలకు వ్యాక్సిన్‌!

Published Sun, Jul 25 2021 3:13 AM

Children Covid Vaccination start from September says AIIMS Chief - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో పిల్లలకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఈ సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. అదే జరిగితే కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి  ఇదో ముఖ్య ఘట్టంగా మారుతుందని అన్నారు. జైడస్‌ క్యాడిలా కంపెనీ జైకోవ్‌–డీ  పిల్లలపై వ్యాక్సిన్‌ ప్రయోగాలు పూర్తి చేసి డేటా కూడా సమర్పించిందని,  అత్యవసర అనుమతి కోసం ఎదురు చూస్తోందని చెప్పారు.

భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ (2–18 ఏళ్ల లోపు పిల్లలకు) ఆగస్టు లేదంటే సెప్టెంబర్‌ నాటికి పూర్తి అవుతాయని, అదే సమయానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ భారత్‌కు సెప్టెంబర్‌ నాటికి వస్తే వెంటనే పిల్లలకి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలు పెట్టవచ్చునని గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వివిధ వార్తా సంస్థలకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. భారత్‌లో జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాగా ఇప్పటివరకు 42 కోట్లకు పైగా టీకా డోసుల్ని ఇచ్చారు.

ఇంచుమించుగా 6% జనాభా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలై ఇన్నాళ్లయినా 18 ఏళ్ల లోపు వారికి మాత్రం టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. పశ్చిమ దేశాల్లో పిల్లలకి ఫైజర్‌ టీకా ఇప్పటికే ఇవ్వడం మొదలుపెట్టగా... మోడర్నా వ్యాక్సిన్‌కి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా 18 ఏళ్ల లోపు వయసు వారికి టీకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో చురుగ్గా ప్రయోగాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ నాటికి పిల్లల కోసం ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్‌లే అందుబాటులోకి వస్తాయని గులేరియా చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి 18–30 శాతం పెరగడానికి 11–17 ఏళ్ల వయసు వారే కారణమని, వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారని  ఇటీవల లాన్సెట్‌ జర్నల్‌ అధ్యయనంలో తేలింది. భారత్‌లో పిల్లలకి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైతే వైరస్‌ వ్యాప్తికి గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు.

బూస్టర్‌ డోస్‌ అవసరమే
కరోనా వైరస్‌లో తరచూ జన్యుపరంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో భవిష్యత్‌లో బూస్టర్‌ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని గులేరియా చెప్పారు. కరోనా వ్యాక్సిన్లు ప్రభావం తగ్గిపోయి రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తే సెకండ్‌ జనరేషన్‌ కోవిడ్‌–19 వ్యాక్సిన్ల (బూస్టర్‌ డోసులు) అవసరం వస్తుందని అన్నారు. ఇప్పటికే బూస్టర్‌ డోసులపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. ఈ ఏడాది చివరి నాటికి బూస్టర్‌ డోసులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చునని, అందుకే అప్పటికల్లా జనాభా మొత్తానికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని గులేరియా చెప్పారు. 

Advertisement
Advertisement