చనిపోయిందని శ్మశానానికి.. ఆఖరు క్షణంలో ట్విస్ట్‌...

Chhattisgarh Woman Found Alive Minutes Before To Cremation - Sakshi

రాయ్‌పూర్‌: ఓ వృద్ధురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. కోవిడ్‌​ టెస్టు చేశారు. నెగటీవ్‌ రీపోర్టు వచ్చింది. కానీ ఈసీజీలో నిల్‌ అని రావడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్లాక అరుదైన ఘటన చోటుచేసుకుంది. అదేంటో తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన 77 ఏళ్ల లక్ష్మీబాయ్‌ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. కొన్ని రోజుల నుంచి ఇంట్లోనే చికిత్స అందిస్తుండగా తాజాగా ఆమె ఆరోగ్యం మ‌రింత క్షీణించడంతో.. భీంరావ్‌ అంబేద్కర్‌ ఆసుపత్రిలో చేర్చారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కోవిడ్‌ టెస్టులు నిర్వహించగా నెగటీవ్‌ రిపోర్టు వచ్చింది. అనంతరం ఈసీజీలో మాత్రం ‘నిల్’ అని రిపోర్టు వచ్చింది. దీన్ని పరిశీలించిన వైద్యులు.. లక్ష్మీబాయి చనిపోయినట్లు  ధృవీకరించారు. 

లక్ష్మీబాయి మనవరాలు నిధి కూడా వైద్యరంగంలోనే పనిచేస్తున్నారు. తన బామ్మ మెడికల్ రిపోర్టులు ఆమె కూడా పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించుకుంది. అనంతరం అంత్యక్రియ‌ల కోసం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గోకుల్ న‌గ‌ర్ శ్మ‌శాన‌వాటిక‌కు తీసుకెళ్లారు. కానీ అప్పటికీ మృతదేహం చల్లబడలేదు. దీంతో నిధికి అనుమానం వచ్చింది. ఒక వైద్యుడిని అక్కడికి పిలిపించి పరీక్షించగా అసలు విషయం బయటపడింది. లక్ష్మీబాయి అప్పటికి ఇంకా మరణించలేదని, పల్స్ మీటర్‌లో ఆక్సిజన్ స్థాయి 85గా ఉందని డాక్టర్ గుర్తించారు. ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందించాలని పేర్కొన్నారు. 

దీంతో వెంటనే లక్ష్మీబాయిని హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. మార్గం మధ్యలో అంబులెన్స్‌లోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయంపై నిధి అంబేడ్కర్ ఆసుపత్రి వైద్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈసీజీ సక్రమంగా తీయకపోవడంతో తన బామ్మ చనిపోయిందని వాపోయింది. కొన్ని గంటల ముందే ఆసుపత్రికి తీసుకొస్తే బతికేదని, తన బామ్మ చావుకు డాక్టర్లే కారణమని ఆరోపించింది. అయితే ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని తమ ఆసుపత్రిలో మొదటిసారి ఇలా జరిగిందని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. 

చదవండి: హోం ఐసోలేషన్‌.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌
ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన భర్త

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top