వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్‌

Chhatisgarh CM Bhupesh Baghel Father Nand Kumar Baghel Arrested - Sakshi

రాయ్‌పూర్‌: ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్టయ్యారు. తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ సంబంధిత సామాజికవర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి తాజాగా మంగళవారం అరెస్ట్‌ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ తండ్రి నంద్‌ కుమార్‌ బాఘేల్‌.
చదవండి: తండ్రిపై కేసు నమోదును సమర్ధించిన ముఖ్యమంత్రి

బ్రాహ్మణులు విదేశీయులని, వారిని బహిష్కరించాలని ఇటీవల నంద్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారని, బ్రాహ్మాణులను గ్రామాల్లోకి రానివ్వొద్దని చెప్పినట్లు సర్వ్‌ బ్రాహ్మణ్‌ సమాజ్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని డీడీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాముడికి వ్యతిరేకంగా కూడా నంద్‌ కుమార్‌ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సంస్థ పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ఉన్నాయని చెబుతూ వాటి సాక్ష్యాలు కూడా అందించారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ సమాజం ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుపై విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు నంద్‌ కుమార్‌ను తాజాగా అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచారు. 15 రోజుల పాటు జ్యూడిషియల్‌ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించింది.

తండ్రిపై కేసు నమోదు కావడంపై ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ స్పందించారు. ‘నా తండ్రివి, నావి రాజకీయ సిద్ధాంతం, నమ్మకాలు వేరు. ఒక కుమారుడిగా నేను నా తండ్రిని గౌరవిస్తా. కానీ ఒక ముఖ్యమంత్రిగా అతడి తప్పిదాలు, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసే అంశాలను క్షమించలేను’ అని పేర్కొన్నాడు. ‘మా నాన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడంతో నేను బాధపడ్డా. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు విఘాతం కలగడం సహించలేను’ అని భూపేశ్‌ పేర్కొన్నారు.  ‘చట్టం కన్నా ఎవరూ ఎక్కువ కాదు’ అని స్పష్టం చేశారు.

చదవండి: జైలు మరుగుదొడ్డిలో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top