సైనిక్‌ స్కూళ్ల ప్రైవేటికరణ: ఖర్గే ఆరోపణలను ఖండించిన కేంద్రం | Sakshi
Sakshi News home page

సైనిక్‌ స్కూళ్ల ప్రైవేటికరణ: ఖర్గే ఆరోపణలను ఖండించిన కేంద్రం

Published Thu, Apr 11 2024 10:43 AM

Centre On Kharge Allegation On Sainik Schools over Unwarranted Misleading - Sakshi

ఢిల్లీ:  దేశంలోని సైనిక్‌ స్కూల్స్‌పై కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర రక్షణ శాఖ ఖండించింది. సైనిక స్కూళ్లను  ‘ప్రైవేటుపరం’ చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ..  ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించింది.

‘సైనిక స్కూళ్లలోని ఎంపిక విధానంలో  రాజకీయ, సిద్ధాంతపరంగా దరఖాస్తు దారులపై ఎటువంటి ప్రభావం చూపించదు. ఈ పథకం లక్ష్యాలు, అమలును రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సైనిక్‌ స్కూల్స్‌పై చేస్తున్నవి వక్రీకరించే, తప్పుదారి పట్టించే ఆరోపణలు’ అని రక్షణ మంత్రిత్వ  శాఖ వివరణ  ఇచ్చింది. 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే.. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరుతూ  రాష్ట్రపతి రాసిన లేఖలో కోరారు. సైనిక్‌ స్కూల్స్‌ను కూడా రాజకీయం చేయడానికి ప్రభుత్వం కఠోర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇక.. ఆర్టీఐ రిపోర్టు ఆధారంగా.. సుమారు 62 శాతం సైనిక్‌ స్కూల్స్‌ బీజేపీ, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు చెందినవిగా తెలిపారు.  

పక్షపాత రాజకీయాలకు దూరంగా సాయుధ బలగాలను వేరుగా ఉంచడం భారత ప్రజాస్వామ్యంలో అనుసరిస్తున్న సంప్రదాయమని, దానిని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగా సాయుధ బలగాల సహజ స్వభావాన్ని, నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సైనిక్‌ స్కూల్స్‌ ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని కోరారు. వాటిపై చేసుకున్న ఎంఓయూలు కూడా చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ఖర్గేలో రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement