
ఐఎస్‌ఐ మార్క్ తప్పనిసరి
ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లకు కేంద్రం ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో వాహనదారుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం బీఐఎస్ గుర్తింపు గల ఐఎస్‌ఐ మార్క్ హెల్మెట్లు మాత్రమే వాడాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. నాణ్యతలేని హెల్మెట్లు ప్రమాదాల సమయంలోరక్షణ కలి్పంచలేకపోవటంతో ప్రాణనష్టం పెరుగుతోందని తెలిపింది. దేశంలో ద్విచక్ర వాహనాల సంఖ్య ఇప్పటికే 21 కోట్లకు పైగా ఉంది. ఈ వాహనదారుల భద్రతకు నాణ్యమైన హెల్మెట్లు కీలకం. అందుకే 2021 నుంచే బీఐఎస్ ప్రమాణం ఐఎస్ 4151:2015 కింద ఐఎస్‌ఐ మార్క్ హెల్మెట్లు వాడటం తప్పనిసరి చేసింది. అయితే, రహదారుల పక్కన, స్థానిక మార్కెట్లలో నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు అధికంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
176 మందికే లైసెన్సులు
హెల్మెట్ల నాణ్యత విషయంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠినంగా వ్వహరిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బీఐఎస్ 30కి పైగా సెర్చ్ అండ్ సీజ్ దాడులు నిర్వహించింది. ఒక్క ఢిల్లీ నగరంలోనే లైసెన్స్ లేకుండా నాణ్యత లేని హెల్మెట్లు తయారు చేస్తున్న 9 మంది తయారీదారుల నుంచి 2,500లకు పైగా హెల్మెట్లు స్వా«దీనం చేసుకుంది. 17 రిటైల్, రోడ్‌సైడ్ దుకాణాల్లో సుమారు 500 నాణ్యత లేని హెల్మెట్లు సీజ్ చేశారు. ప్రస్తుతం దేశంలో 176 మంది తయారీదారులకు మాత్రమే బీఐఎస్ నుంచి హెల్మెట్ల తయారీకి లైసెన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జిల్లాధికారులు, కలెక్టర్లు హెల్మెట్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి, నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే చెన్నైలో ‘మానక్ మిత్ర’వలంటీర్ల ద్వారా ‘క్వాలిటీ కనెక్ట్’క్యాంపెయిన్ నిర్వహించి వినియోగదారులకు బీఐఎస్ గుర్తింపుపై ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.