మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించే దిశగా నిర్మాణాత్మక వైఖరి తీసుకున్నాం 

Central Government informed Delhi High Court On Marital Rape - Sakshi

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: మారిటల్‌ రేప్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణించే దిశగా నిర్మాణాత్మకమైన వైఖరిని తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. క్రిమినల్‌ చట్టాలకు సమగ్రమైన సవరణలు చేయడానికి.. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రధాన న్యాయమూర్తి, ఎంపీలు, ఇతరుల అభిప్రాయాలను కోరామని వెల్లడించింది. భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతగా కోరిక తీర్చుకుంటే దాన్ని మారిటల్‌ రేప్‌గా పిలుస్తారు. దంపతులైనా, సహజీవనం చేస్తున్నా.. మహిళ సమ్మతి లేకుండా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా సంభోగం చేస్తే... పాశ్చాత్య దేశాల్లో నేరంగా పరిగణిస్తారు. రేప్‌గానే చూసి... సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అయితే భారత సమాజంలో భిన్న మతాలు, సంస్కృతులు, ఆచారాలు, నిరక్షరాస్యత తదితరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాలు మారిటల్‌ రేప్‌ను నేరంగా చేయడం సాధ్యం కాదని కొన్నేళ్లుగా న్యాయస్థానాలకు చెబుతున్నాయి. మహిళల నుంచి గట్టిగా డిమాండ్లు వచ్చినపుడు కూడా ఇదే సమాధానాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చాయి. 

మారిటల్‌ రేప్‌ను నేరంగా ప్రకటించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులు గురువారం విచారణకు రాగా... సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్రం తాజా వైఖరి గురించి తన ముందు ప్రస్తావించారని, అయితే ఇది బెంచ్‌లోని తోటి సభ్యుడు జస్టిస్‌ సి.హరి శంకర్, ఈ కేసులోని ఇతర పక్షాల గైర్హాజరులో జరిగిందని జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌ వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది మోనికా అరోరా స్పందిస్తూ.. ‘క్రిమినల్‌ లాలో సమగ్ర మార్పులు చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో ఐపీసీలోని సెక్షన్‌ 375 (రేప్‌) కూడా ఉంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుల సీజేలు,  ఉభయసభల ఎంపీలు, ఇతరుల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించాం’ అని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.

చట్టంలో సమూల మార్పులంటే సమయం పడుతుందని, మారిటల్‌ రేప్‌ అంశాన్ని ప్రత్యేకంగా ఏమైనా పరిశీలిస్తున్నారేమో చెప్పాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రేప్‌ కేసులకు సంబంధించిన సెక్షన్‌ 375కి సంబంధించి మీరేమైనా సూచనలు చేస్తే మేము పరిగణనలోకి తీసుకొని ఆదేశాలిస్తామని తెలిపింది. పిటిషనర్లు కోరుతున్నారని మారిటల్‌ రేప్‌కు ప్రస్తుతమున్న మినహాయింపులను కొట్టివేయలేమని ఇదివరకే దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో హోంశాఖ తెలిపింది. సహజ న్యాయసూత్రాల ప్రకారం... భాగస్వామ్య పక్షాలందరి వాదనలు వినడం అవసరమని పేర్కొంది.

ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు తమ సలహాలు, సూచనలు చేసే స్వేచ్ఛ పిటిషన్‌దారులకు ఉందని పేర్కొంది. కొన్ని పరిస్థితుల్లో అది రేప్‌ కాదనడం సమస్యేనని ధర్మాసనం గతంలో మౌఖికంగా అభిప్రాయపడింది. ‘సెక్స్‌ వర్కర్‌ సమ్మతి లేకుండా బలవంతం చేస్తే (ఆమె ఏ దశలో నిరాకరించినా) అది రేప్‌ కిందకే వస్తుందని, ఎలాంటి మినహాయింపులుండవని చట్టం చెబుతోంది. మరి అర్ధాంగికి ఎందుకు నిరాకరించే హక్కు ఉండకూడదు? ఆమెను తక్కువగా చూడటం సబబేనా? అని జస్టిస్‌ షక్దర్‌ ప్రశ్నించారు. ఈ అంశంలో కోర్టుకు సహాయకారిగా (అమికస్‌ క్యూరీగా) నియమితులైన సీనియర్‌ న్యాయవాది రాజశేఖర్‌ రావు.. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనని, అలాంటపుడు భర్త కోరిక.. భార్య నిరాకరణ కంటే ఎందుకు అధికమని ప్రశ్నించారు. మారిటల్‌ రేప్‌ నుంచి భర్తలకు మినహాయింపునివ్వడం నిర్హేతుకమని.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21లకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top