
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాల వివరాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఉత్తీర్ణత 0.41% పెరిగిందని సీబీఎస్ఈ వెల్లడించింది. 1692794 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 1496307 మంది (88.39%) పాసయ్యారు. గతేడాది 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలురు కంటే 5.94% ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 91.64 శాతం, బాలురు 85.70 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్‌జెండర్లు వంద శాతం పాస్‌కావడం విశేషం. గతేడాదితో పోలిస్తే బాలురు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ల ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2024లో బాలికలు 91.52, బాలురు 85.12, ట్రాన్స్‌జెండర్లు 50 శాతం ఉత్తీర్ణత సాధించారు.
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. 7330 పరీక్షా కేంద్రాల్లో 19299 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విజయవాడ రీజియన్‌లో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత నమోదయింది. 99.32 శాతంతో త్రివేండ్రం రెండో స్థానం, చెన్నై 97.39 శాతంతో మూడో స్థానం దక్కించుకుంది.
జవహర్ నవోదయ విద్యాలయ 99.29%, కేంద్రీయ విద్యాలయ 99.05%, సంభోటా టిబెటన్ స్కూల్స్ సొసైటీ 98.96%, గవర్నమెంట్ ఎయిడెడ్ 91.57%, ప్రభుత్వ పాఠశాలలు 90.48%, ఇండిపెండెంట్ స్కూల్స్ 87.94% ఉత్తీర్ణత సాధించాయని సీబీఎస్ఈ ప్రకటించింది. 10వ తరగతి ఫలితాలు కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
