హాథ్రస్‌ కేసులో చార్జ్‌షీట్‌

CBI files chargesheet against four accused on counts of Molestation - Sakshi

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన హాథ్రస్‌ కేసులో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు చేసింది. యూపీలోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన దళిత యువతిపై అత్యాచారం, హత్యకు సంబంధించి నలుగురిపై సీబీఐ నేరారోపణ చేస్తూ శుక్రవారం కోర్టులో చార్జ్‌షీటు ఫైల్‌ చేసింది. రెండు నెలల దర్యాప్తు అనంతరం నిందితులు సందీప్, రవి, లవ్‌కుశ్,  రాము సెప్టెంబర్‌14న దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు సీబీఐ  పేర్కొంది.

చార్జ్‌షీటులో వీరిపై అత్యాచారం, హత్య, సామూహిక అత్యాచారం, ఎస్‌సీ ఎస్‌టీ అట్రాసిటీ సెక్షన్ల కింద నేరారోపణ చేసింది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే గరిష్ఠంగా మరణ శిక్ష విధిస్తారు. చనిపోయిన యువతి వాంగ్మూలం, సాక్ష్యాలు, ఇతర సాక్షుల స్టేట్‌మెంట్ల ఆధారంగా విచారణ పూర్తి చేసినట్లు సీబీఐ తెలిపింది. సీబీఐ చార్జ్‌షీటుతో అసలు నేరమే జరగలేదన్న యూపీ పోలీసుల వాదన తేలిపోయినట్లయింది. అత్యాచారమే జరగలేదన్న పోలీసుల వాదనపై అప్పట్లో  తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు యువతి అంత్యక్రియలపై అలహాబాద్‌ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులకు అక్షింతలు వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top