
చండీగఢ్: మత ఘర్షణలతో హర్యానా రాష్ట్రం అట్టుడుకుతోంది. నాలుగు రోజుల క్రితం చెలరేగిన అల్లర్లతో నూహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నూహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ చర్చ చేపట్టింది. హింసాకాండకు గురైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని టౌరు ఏరియాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివసిస్తున్న వసలదారుల గుడిసెలను అధికారులు కూల్చివేశారు.
కాగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింసలో బయటి వ్యక్తులు(చొరబాటుదారులు) పాల్గొన్నారని పోలీసులతోపాటు సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సైతం ఆరోపించారు. ఈ క్రమంలో అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలుగా భావించి బుల్డోజర్ యాక్షన్‌కు దిగినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం ఖట్టరే ఈ కూల్చివేతలకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గతంలో అస్సాంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ శరణార్థులు.. ఇటీవల హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్‌పూర్ రహదారి మార్గంలో వార్డు నంబర్ వన్‌లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించి, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం.
చదవండి: హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు
<
Bulldozer action in Haryana..
— The Lallantop Guy (@Lallantop_Guy) August 4, 2023
Non of the Pattharbaazs should be spared... 🔥🔥🔥🔥 pic.twitter.com/CEIyUyx0re
భారీ పోలీసు, పారామిలటరీ బలగాల మోహరింపు మధ్య, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా బుల్డోజర్ చర్య జరిగింది. పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో తరహాలో హర్యానాలోనూ బుల్డోజర్ చర్యలు తీసుకుంటామని రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా గురువారం టౌరులోని రెండు మసీదులను అల్లరిమూకలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాయి. మరోవైపు గురుగ్రామ్ మసీదులలో శుక్రవారం ప్రార్ధనలు(జుమ్మా నమాజ్) నిలిపివేస్తున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. ప్రజలు తమ్మ ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రసాద్ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నూహ్ జిల్లాలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఇంటర్నెట్, ఎస్‌ఎమ్‌ఎస్ సేవలు నిలిపివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు సడలింపు ప్రకటించారు.
చదవండి: తెగిన లిఫ్ట్ వైర్, 8వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో..