
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. ఈ సమావేశాల్లో భాగంగా బడ్జెట్, ద్రవ్యవినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ సమావేశాల సమయాన్ని కుదించారు. ఏప్రిల్ 8వరకు జరగాల్సి ఉన్న పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
రెండు నెలలపాటు కొనసాగిన ఈ సమావేశాలు జనవరి29న ప్రారంభమయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువులు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.