బీఎస్పీ తదుపరి చీఫ్‌ దళిత వర్గం నుంచే..

BSP supremo Mayawati says only a Dalit will lead the party - Sakshi

పార్టీ చీఫ్‌ మాయావతి స్పష్టీకరణ

లక్నో: ‘నేనిప్పుడు ఫిట్‌గానే ఉన్నాను. అన్‌ఫిట్‌గా మారడానికి ఇంకా చాలా సంవత్సాలు పడుతుంది. కాబట్టి నా తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తిని ఇప్పుడే ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు దళిత వర్గం నుంచే ఎంపిక ఉంటుంది’ అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ మాయావతి స్పష్టం చేశారు. పార్టీ జనరల్‌ సెక్రటరీ సతీశ్‌ మిశ్రా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా కరోనా ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడలేదని ఆమె అన్నారు. ఆరోగ్యం సహకరించనప్పుడే పార్టీ పగ్గాలను వేరేవారికి అప్పగిస్తానని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో పార్టీతో ఉన్న వారికే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు.

బీఎస్పీ స్థాపకుడు కాన్షీరాం కూడా తన ఆరోగ్యం క్షీణించాకే తదుపరి చీఫ్‌ను ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన 24 పేజీల బుక్‌లెట్‌ గురించి ఆమె స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ తమ ర్యాలీలకు, సమావేశాలకు డబ్బు, ఆహారం ఎరగా వేసి ప్రజలను రప్పిస్తుందని విమర్శించారు. ప్రజల మద్దతును కాంగ్రెస్‌ కోల్పోయిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో క్యాంపెయిన్‌కోసం పారిశ్రామి కవేత్తలపై ఆధారపడుతోందని, కానీ బీఎస్పీ మాత్రం ఆర్థికంగా స్థితిమంతులు కాని వారికి కూడా టికెట్లు ఇస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌లా తమ పార్టీ పెట్టుబడిదారుల పార్టీ కాదని పేదలు, అణగారిన వారి పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్‌ వ్యవహరించే రెండు నాల్కల ధోరణి వల్లే ఆ పార్టీకి ఈ గతి పట్టిందన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టినట్లు వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top