
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ఆపాల్సిందేనన్న విపక్షాలు
ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్
కొనసాగిన విపక్షసభ్యుల ఆందోళనలు, నినాదాలు
అర్ధంతరంగా వాయిదాపడిన ఇరుసభలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో చేపట్టిన వివాదాస్పద ఓటర్ల జాబితా సమగ్ర సవరణ క్రతువును తక్షణం నిలిపివేయాలన్న విపక్షాల డిమాండ్లతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. గురువారం ఉదయం రాజ్యసభలో సభాకార్యకలాపాలు మొదలవగానే విపక్షసభ్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు.
ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల చర్యకు ప్రధాని మోదీ ఎందుకు రాజ్యసభలో సమాధానం ఇవ్వలేదని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీ వెంటనే ఆపేయాలనీ విపక్ష సభ్యులు డిమాండ్‌చేశారు. దీంతో సభను సభాధ్యక్షుడు మధ్యా హ్నం 2 గంటలవరకు వాయిదావేశారు.
తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే విపక్షాల డిమాండ్ల పర్వం కొనసాగింది. వెంటనే ప్రధాని మోదీ సభకు వచ్చి ఆపరేషన్ సిందూర్‌పై సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు సభాధ్యక్షుడు సస్మిత్ పాత్రా అనుమతించారు. ‘‘ 2008లో ముంబై ఉగ్రదాడులపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో వివరణ ఇవ్వనప్పుడు నాట హోం మంత్రి వివరణ ఇచ్చారు. అంతేగానీ హోం మంత్రి అమిత్ షా లాగా ‘‘ నేనొక్కడినే మీ అందరినీ అదమాయించగలను.
హ్యాండిల్ చేస్తాను’’ అని అందర్నీ తూలనాడలేదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ సభకు వచ్చి మాట్లాడాలి’’ అని ఖర్గే డిమాండ్‌చేశారు. ఈయన మాటలకు విపక్షసభ్యులు గొంతు కలిపారు. దీంతో చేసేదిలేక సభను సాయంత్రం నాలుగున్నర గంటలదాకా వాయిదావేశారు. 4.30 గంటలకు సభ మొదలయ్యాక ట్రంప్ చేసిన ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు వాణిజ్యమంత్రి గోయల్ ఘాటుగా స్పందిస్తూ ప్రకటనచేశారు. అయినాసరే విపక్షసభ్యులు తమ నినాదాలను ఆపకపోవడంతో చివరకు సభను శుక్రవారానికి వాయిదావేశారు.
లోక్‌సభలోనూ అదే తీరు..
లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. లోక్‌సభ ఉదయం మొదలుకాగానే జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు సభ అభినందించింది. తర్వాత వెంటనే బిహార్ అంశంపై విపక్ష సభ్యులు నినాదాలు మొదలెట్టారు. ‘‘ ఇలా నినాదాలు చేయడానికి మనల్ని ఓటర్లు ఓట్లేసి గెలిపించుకున్నారా? దయచేసి మీమీ సీట్లలో కూర్చోండి’’ అని లోక్‌సభ స్పీకర్ బిర్లా మందలించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు.
తొలుత రెండు గంటల దాకా సభ వాయిదాపడింది. తర్వాత ఇదే పునరావృతంకావడంతో అప్పుడు సభాధ్యక్ష స్థానంలో కూర్చన్న అవదేశ్ ప్రసాద్ సభను నాలుగు గంటలకువాయిదావేశారు. నాలుగు గంటలకు సభ మొదలవగానే మంత్రి పియూశ్ గోయల్ మాట్లాడారు. ఆ తర్వాత నినాదాలు కొనసాగడంతో స్పీకర్ బిర్లా సభను శుక్రవారానికి వాయిదావేశారు.