బీజేపీ గుండెల్లో రెబెల్స్‌! | BJP eyes hat-trick in Assam, faces heat from dissidents | Sakshi
Sakshi News home page

బీజేపీ గుండెల్లో రెబెల్స్‌!

Mar 26 2026 4:15 AM | Updated on Mar 26 2026 2:26 PM

BJP eyes hat-trick in Assam, faces heat from dissidents

అస్సాంలో అధికార కూటమికి కష్టాలు

టికెట్లు దక్కని సీనియర్ల సహాయ నిరాకరణ 

భాగస్వాములతో బీజేపీ స్నేహపూర్వక పోటీలు 

హ్యాట్రిక్‌ ఆశలకు గండి పడుతుందేమోనని గుబులు

అస్సాంలో హ్యాట్రిక్‌పై కన్నేసిన అధికార బీజేపీకి రెబెల్స్‌ బెడద పెద్ద తలనొప్పిగా తయారైంది. పలు స్థానాల్లో ఎంత బుజ్జగించినా బరినుంచి తప్పుకోవడానికి తిరుగుబాటు అభ్యర్థులు ససేమిరా అంటుండటం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి చెందిన ఇతర పార్టీలకు కూడా రెబెల్స్‌ పోటు తప్పడం లేదు. 

ఇవి చాలవన్నట్టు పలుచోట్ల కూటమి పక్షాల నడుమ కూడా స్నేహపూర్వక పోటీలకు కూడా రంగం సిద్ధమైంది! రెబెల్స్, అసమ్మతులు, స్నేహపూర్వక పోటీల వంటి సమస్యలు కనీసం 20 పై చిలుకు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. ఇవన్నీ చివరికి అధికార కూటమి విజయావకాశాలనే దెబ్బ తీస్తాయేమోనన్న అభిప్రాయాలు బీజేపీ నేతల నుంచే వ్యక్తమవుతుండటం విశేషం! 

ఈశాన్యాన బీజేపీకి అత్యంత కీలకమైన అస్సాంలో పోలింగ్‌ గడువు శరవేగంగా సమీపిస్తోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ భవితవ్యం ఏప్రిల్‌ 9న జరిగే పోలింగ్‌లో తేలిపోనుంది. ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి సమరశంఖం పూరించిన బీజేపీ సరికొత్త తలనొప్పులతో సతమతమవుతోంది. ఈసారి ఏకంగా 19 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్‌ నిరాకరించింది. దాంతో వారిలో పలువురు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. సీనియర్‌ నాయకులు పలుమార్లు 

పిలిపించుకుని బుజ్జ
గించినా తప్పుకునేందుకు ససేమిరా అంటూ పల్స్‌ రేటు పెంచేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని అస్సాం గణ పరిషద్‌ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. టికెట్లు దక్కని వారిలో పలువురు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని బీజేపీ కూటమికి ప్రత్యర్థులుగా బరిలో దిగుతుండటం మరో విశేషం! మంత్రి నందితా గార్లోసా విషయంలో అదే జరిగింది. బీజేపీ టికెట్‌ నిరాకరించడంతో మర్నాడే కాంగ్రెస్‌లో చేరారామె. 

ఆ పార్టీ తరఫున తన సిట్టింగ్‌ స్థానం హాఫ్‌లాంగ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అస్సాం బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు జయంతకుమార్‌ దాస్‌దీ ఇదే కథ. దిస్పూర్‌ టికెట్‌ను ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ప్రద్యోత్‌ బోర్డోలోయ్‌కి బీజేపీ కేటాయించింది. ఆ స్థానాన్ని ఆశించిన దాస్‌ వెంటనే బీజేపీకి రాజీనామా చేసి స్వతంత్రునిగా బరిలో దిగారు! కటీగోరా బీజేపీ మాజీ ఎమ్మెల్యే అమర్‌చంద్‌ జైన్‌ కూడా టికెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మారారు. 
 
సీనియర్ల అసంతృప్తి 
ఈసారి పలువురు సీనియర్‌ బీజేపీ నేతలు కూడా తమకు టికెట్లు దక్కకపోవడంతో నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ జాబితాలో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ భట్టాచార్య, ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన అతుల్‌ బోరా వంటి హేమాహమీలున్నారు. వారంతా పార్టీపై కినుక వహించడమే గాక ప్రచారానికి దూరంగా ఉండాల్సిందిగా తమ అనుయాయులకు, స్థానిక శ్రేణులకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. దాంతో పలు అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ ప్రచారం బోసిపోయి కన్పిస్తోంది. టికెట్లు దక్కని ఇతర సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులను కూడా ఈ సీనియర్లు పార్టీకి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారన్న వార్తలు బీజేపీ నాయకత్వానికి మరింత గుబులు పుట్టిస్తున్నాయి. 

ఏజీపీతోనూ తలనొప్పులు 
ఎన్డీఏ భాగస్వామి అస్సాం గణ పరిషద్‌తోనూ బీజేపీకి తలనొప్పులు తప్పడం లేదు. పలు స్థానాల్లో వాటి మధ్య స్నేహపూర్వక పోటీ తప్పని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇది అంతిమంగా కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చే పరిణామమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే దీన్ని బీజేపీ స్వయంకృతాపరాధంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఏజీపీకి కేటాయించిన పలు స్థానాల్లో ఆ పార్టీ కూడా బరిలో దిగుతుండటమే ఇందుకు కారణం. శివసాగర్‌లో ఏజీపీ ప్రదీప్‌ హజారికాకు టికెటివ్వగా చివరి క్షణాల్లో బీజేపీ కుషాద్‌ దొవారీని బరిలో దింపింది. 

ఏజీపీ బరిలో ఉన్న చామరియాలో కూడా బీజేపీ నామినేషన్ల చివరి రోజున తన అభ్యర్థిని బరిలో దించింది. తిరుగుబాట్లు, రెబెల్స్, అసమ్మతులు, అసంతృప్తులు చాలా స్థానాల్లో సమస్యగానే పరిణమించినట్టు రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత ఒకరు అంగీకరించారు. ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తామో అర్థం కావడం లేదంటూ  ఆయన వాపోయారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి దాస్‌రూపం గోస్వామి మాత్రం ఈ ఆందోళనలను కొట్టిపారేశారు. ‘‘బీజేపీ వంటి పెద్ద పార్టీలో ఆశావహులు చాలామంది ఉంటారు గనుక ఎంతో కొంత అసంతృప్తి సహజమే. వారంతా త్వరలోనే దారికొస్తారు’’ అని చెప్పుకొచ్చారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Advertisement
 
Advertisement
Advertisement