బిహార్‌ ఆలయంలో విషాదం | Bihar Temple Stampede: 8 Devotees Dead At Nalanda | Sakshi
Sakshi News home page

బిహార్‌ ఆలయంలో విషాదం

Apr 1 2026 3:56 AM | Updated on Apr 1 2026 3:56 AM

Bihar Temple Stampede: 8 Devotees Dead At Nalanda

శీతలామాత ఆలయంలో తొక్కిసలాట 

ఎనిమిది మంది భక్తుల దుర్మరణం 

మరో 8 మందికి గాయాలు 

దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ

బిహార్‌ షరీఫ్‌: బిహార్‌లోని నలంద జిల్లాలోని శీతలామాత ఆలయంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. దీప్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బిహార్‌ షరీఫ్‌ పట్టణంలోని ఈ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎనిమిది మంది గాయపడ్డారు. విషయం తెల్సి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు.

మంగళవారం ఉదయం ఈ తొక్కిసలాట జరిగిందని బిహార్‌ షరీఫ్‌ పట్టణ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నూరుల్‌ హక్‌ మీడియాకు తెలిపారు. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో అత్యంత శుభప్రదంగా భావించి మంగళవారం తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. సరైన నిర్వహణ లేకపోవడంతో తొక్కిసలాట జరిగిందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు, భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘చైత్రమాసం చివరి మంగళవారం, మహావీర్‌ జయంతి కలిసిరావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇదే సమయంలో బారికేడ్లు విరిగిపోవడంతో జనం ఒక్కసారిగా కిందపడడంతో తొక్కిసలాట జరిగింది’’ అని స్థానికుడు ఒకరు వెల్లడించారు.

‘‘తొక్కిసలాట జరగడంతో అంతా గందరగోళ పరిస్థితి తలెత్తింది. వెంటనే పోలీసులు వచ్చి భక్తులను వెనక్కి తోసేశారు. లాఠీచార్జ్‌ చేశారు’’ అని ఒక భక్తుడు తెలిపారు. భక్తుల మరణవార్త తెల్సి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి అందజేయనున్నారు.

క్షతగాత్రులకు తలో రూ.50,000ను ఇవ్వనున్నారు. ఘటనపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.6 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ప్రకటించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని దీప్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తెలిపారు. వివరాలు తెల్సుకునేందుకు ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆలయంలో అధ్వాన్న ఏర్పాట్ల కారణంగానే తొక్కిసలాట జరిగిందని బిహార్‌ శాసనసభలో విపక్షనేత తేజస్వీయాదవ్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement